Site icon NTV Telugu

Kejriwal: ఆప్ అధికారంలోకి వస్తే బీజేపీలాగానే చేస్తాం

Kejriwal

Kejriwal

కేంద్రం తీరుకు నిరసనగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ వేదికగా (Delhi) ఆందోళనకు దిగుతున్నాయి. జంతర్‌మంతర్ దగ్గర బుధవారం కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. గురువారం కేరళ ప్రభుత్వం నిరసనకు దిగింది. నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ కేరళ ఆరోపించింది. కేంద్రం తీరును నిరసిస్తూ కేరళ సర్కార్ ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ఒక కొత్త ఆయుధంగా మార్చుకుందని ఆరోపించారు. కోట్లాది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిపక్ష ప్రభుత్వాలపై కేంద్రం అస్త్రంగా ప్రయోగిస్తోందని మండిపడ్డారు. గతంలో నేరం రుజువైతే జైలుకు పంపేవారు. కానీ.. ప్రస్తుతం జైలుకు పంపాక వారిపై ఏ కేసు పెట్టాలా అని ఆలోచిస్తున్నారన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆప్‌కి కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రం ఇదే సీన్‌ రిపీట్‌ అవుతుందని హెచ్చరించారు. ఇప్పుడు బీజేపీ చేసినట్లుగానే మేముచేస్తామని పేర్కొన్నారు.

జార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌పై కేసు నమోదు చేయకముందే ఆయన్ను జైల్లో పెట్టారని ఆరోపించారు. కొద్ది కాలంలోనే తనతో సహా కేరళ సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా జైల్లో పెట్టి ఆయా ప్రభుత్వాలను పడగొట్టే అవకాశం లేకపోలేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు

కేంద్ర నిధుల విషయంలో కేరళకు అన్యాయం జరుగుతోందని సీఎం పినరయి విజయన్‌ దేశ రాజధానిలో ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Exit mobile version