Site icon NTV Telugu

WFI Suspension: డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త ప్యానెల్‌పై వేటు!

Wfi Suspension

Wfi Suspension

Sports Ministry Suspends New Wrestling Body: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) కొత్త ప్యానెల్‌పై వేటు పడింది. క్రీడా మంత్రిత్వ శాఖ విధివిధానాలను అతిక్రమించిన కారణంగా డబ్ల్యూఎఫ్‌ఐను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్‌ఐ బాడీపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవలే భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నికల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ తన పట్టు నిరూపించుకున్నాడు. మొత్తంగా 15 పదవుల్లో తన వర్గానికి చెందిన 13 మందిని గెలిపించుకున్నాడు. బ్రిజ్‌ భూషణ్‌ ప్రధాన అనుచరుడిగా పేరొందిన ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత అనిత షెరాన్‌పై 40–7 ఓట్ల తేడాతో గెలిచి సంజయ్‌.. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అండర్‌-15, అండర్‌-20 జాతీయ పోటీలను యూపీలోని గోండాలో నిర్వహించనున్నట్లు సంజయ్‌ ప్రకటించారు. పోటీలకు సిద్ధమయ్యేందుకు రెజ్లర్లకు తగిన సమయం ఇవ్వకుండా.. ప్రకటన వెలువరించిన కారణంగా కొత్త ప్యానెల్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది.

Also Read: MLA Lasya Nanditha: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత!

‘అండర్‌-15, అండర్‌-20 జాతీయ రెజ్లింగ్‌ పోటీలను ఈ ఏడాది చివరినాటికి యూపీలోని నందినీ నగర్‌, గోండాలో నిర్వహిస్తామని డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్‌ సింగ్ ప్రకటించారు. ఈ ప్రకటన డబ్ల్యూఎఫ్‌ఐ, క్రీడా శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. పోటీలకు సిద్ధమయ్యేందుకు రెజ్లర్లకు సమయం ఇవ్వకుండా.. ఇలాంటి ప్రకటన చేయడం సరికాదు. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ రెజ్లింగ్ పోటీలను నిర్వహించాలి. అందుకు విరుద్ధంగా ప్రకటన చేయడంతోనే కొత్త ప్యానెల్‌ను సస్పెండ్ చేశాం’ అని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.

Exit mobile version