WBBL 2026: టీ20 క్రికెట్‌లో మ్యాచ్ టై అయి ‘సూపర్ ఓవర్’ పడితే ఆటగాళ్లతో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఇలాంటి అత్యంత ఉత్కంఠభరిత క్షణాలు చాలా అరుదుగా మాత్రమే మైదానంలో కనిపిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) లో హోబర్ట్ హరికేన్స్ వర్సెస్ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మ్యాచ్‌లోనూ సరిగ్గా ఇలాంటిదే అభిమానులను అలరించాల్సింది. కానీ, హోబర్ట్ వికెట్ కీపర్ చేసిన ఒక చిన్న తప్పిదం మ్యాచ్‌ను ఒక్కసారిగా తలకిందులు చేసింది. ఆ బ్లండర్ కారణంగా అంపైర్ అరుదైన ‘నో బాల్’ ప్రకటించడంతో హోబర్ట్ జట్టు ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు సాధించింది. జట్టు కెప్టెన్ నికోలా కేరీ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. కేవలం 43 బంతుల్లోనే 10 ఫోర్ల సాయంతో 62 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ఓపెనర్ హేలీ మాథ్యూస్ హాఫ్ సెంచరీతో మంచి ఆరంభాన్ని ఇచ్చింది. అయితే, జట్టు స్కోరు 101 నుంచి 138 పరుగులకు చేరుకునే క్రమంలో కేవలం 37 పరుగుల వ్యవధిలోనే రెనెగేడ్స్ కీలకమైన 5 వికెట్లను కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. దీంతో మ్యాచ్ చివరి ఓవర్ వరకు హోరాహోరీగా సాగింది. చివరి బంతికి రెనెగేడ్స్ విజయానికి కేవలం 1 పరుగు మాత్రమే అవసరమైన సమయంలో స్కోర్లు 154 పరుగులతో సమమయ్యాయి. నికోలా కేరీ వేసిన ఆఖరి బంతిని స్ట్రైక్‌లో ఉన్న డియాండ్రా డాటిన్ సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయింది. బంతిని అందుకున్న వికెట్ కీపర్ లిజెల్ లీ వేగంగా కలెక్ట్ చేసుకోవడంతో బ్యాటర్లు పరుగు తీయలేకపోయారు. దీంతో మ్యాచ్ టై అయ్యిందని, సూపర్ ఓవర్ ఖాయమని భావించిన ఇరు జట్లు సిద్ధమవుతున్న దశలో థర్డ్ అంపైర్ రంగంలోకి దిగారు.
టీవీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్‌కు ఒక కీలక విషయం స్పష్టమైంది. వికెట్ కీపర్ లిజెల్ లీ బంతిని స్టంప్స్ వెనుక కాకుండా, స్టంప్స్‌కు ముందు నుంచే చేతుల్లోకి తీసుకున్నట్లు కనిపించింది. క్రికెట్ నిబంధనల్లోని ‘రూల్ 27.3’ ప్రకారం.. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లేదా బ్యాట్ తాకకముందు, లేదా అది వికెట్లను దాటకముందు, లేక బ్యాటర్ పరుగు తీసేందుకు క్రీజు దాటకముందు వరకు వికెట్ కీపర్ తన శరీరాన్ని, గ్లౌవ్స్‌ను పూర్తిగా స్ట్రైకర్ వైపు ఉన్న వికెట్ల వెనుకే ఉంచాలి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే దానిని ఫీల్డ్ అంపైర్లు ‘నో బాల్’గా పరిగణిస్తారు. రీప్లేలో లీ గ్లౌవ్స్ స్టంప్స్ రేఖను దాటి ముందుకు రావడంతో అంపైర్ వెంటనే దాన్ని ‘నో బాల్’గా ప్రకటించారు. దీంతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు ఆ ఎక్స్‌ట్రా రన్ లభించడంతో సూపర్ ఓవర్ లేకుండానే వారు విజయాన్ని అందుకున్నారు. చేతిదాకా వచ్చిన సూపర్ ఓవర్ అవకాశం కాస్తా.. వికెట్ కీపర్ చేసిన చిన్న పొరపాటుతో చేజారిపోవడంతో హోబర్ట్ హరికేన్స్ తీవ్ర నిరాశతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెత్తిన హల్చల్ చేస్తోంది.
CRAZY END IN HOBART 🤯
Rare no-ball call denies Super Over between @HurricanesBBL and @RenegadesBBL 😮💨 https://t.co/MtDY6KBWN8
— Weber Women’s Big Bash League (@WBBL) November 4, 2026

