Deandra Dottin Bowled Without Facing a Ball: క్రికెట్‌లో రనౌట్, బౌల్డ్, క్యాచ్, స్టంపింగ్ వంటి ఎన్నో రకాల ఔట్లు చూస్తుంటాం. కానీ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బ్యాటర్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరడం ఎప్పుడైనా చూశారా..? లేదు కదా.. అయితే ఇప్పుడు అలాంటి అరుదైన ఘటన ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL 2026)లో చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ వేదికగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియాండ్రా డాటిన్ ఈ విచిత్రమైన రీతిలో ఔటైంది.
ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తొలుత బ్యాటింగ్ చేసి 138 పరుగుల లక్ష్యాన్ని మెల్‌బోర్న్ రెనెగేడ్స్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో రెనెగేడ్స్ జట్టు 97 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన డియాండ్రా డాటిన్ క్రీజులోకి చేరుకోవడానికి 75 సెకన్లకు పైగా సమయం తీసుకుంది. నిర్ణీత సమయంలో బ్యాటింగ్‌కు సిద్ధం కాకపోవడంతో అంపైర్లు WBBL ప్రత్యేక నిబంధనను అమలు చేశారు.
ఈ నిబంధన ప్రకారం కొత్త బ్యాటర్ 75 సెకన్లలో బంతిని ఎదుర్కోవడానికి సిద్ధం కాకపోతే, బ్యాటర్‌ను పక్కకు నిలబెట్టి బౌలర్‌కు ఖాళీ స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బంతి వేసే అవకాశం కల్పిస్తారు. ఆ బంతి నేరుగా వికెట్లను తాకితే బ్యాటర్ ఔట్ అయినట్లే. ఈ అవకాశాన్ని బ్రిస్బేన్ హీట్ బౌలర్ సారా గ్లెన్ చక్కగా ఉపయోగించుకుంది. ఆమె వేసిన బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో డాటిన్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే బౌల్డ్ అయింది. దీంతో ఆమె గోల్డెన్ డక్‌గా వెనుదిరిగింది.
WBBL, BBL చరిత్రలో ఈ ప్రత్యేక నిబంధన ద్వారా నమోదైన తొలి వికెట్ ఇదే. ఈ ఘటనపై రెనెగేడ్స్ కెప్టెన్ సోఫీ మోలిన్యూ స్పందిస్తూ.. ఇలాంటి పరిస్థితి క్రికెట్‌లో గతంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొంది. సారా గ్లెన్ ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకుందని ప్రశంసించింది. ఇలాంటి ఘటనలు ఆటగాళ్లకు నిబంధనలపై అవగాహన కల్పించే పాఠాలని అభిప్రాయపడింది. మరోవైపు, డాటిన్ వికెట్ కోల్పోయినప్పటికీ మెల్‌బోర్న్ రెనెగేడ్స్ వెనక్కి తగ్గలేదు. 97 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు, మిగతా బ్యాటర్ల పోరాటంతో లక్ష్యానికి చేరువైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Extraordinary.
Deandra Dottin was late to the middle. Now she’s out after Sarah Glenn hit the stumps with a ball she couldn’t face! #WBBL12 https://t.co/lsG3SZAw8b
— Weber Women’s Big Bash League (@WBBL) November 25, 2026

