Site icon NTV Telugu

KMC Hospital : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు అస్తవ్యస్తం..

Kmc Hospital

Kmc Hospital

KMC Hospital : రాష్ట్ర స్థాయిలో పేరొందిన వరంగల్ KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెల రోజులుగా తీవ్ర అసౌకర్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలోని సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం నిలిచిపోయింది. ముఖ్యంగా చిల్లర్స్ మోటార్‌ రిపేర్‌లో ఉండటంతో మొత్తం ఆసుపత్రి అంతటా ఏసీలు పనిచేయకపోవడం, తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఆసుపత్రిలో రోజూ నిర్వహించాల్సిన సర్జరీలు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణ చికిత్సలకే కాదు, అత్యవసర శస్త్రచికిత్సలకూ అవకాశం లేకుండా పోయింది. దీని వల్ల వైద్యులు రోగులను హైదరాబాద్‌కి రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీ స్టేటస్ ఉన్న ఈ ఆసుపత్రిలో అందాల్సిన సేవలు కలగజేసుకోవాలంటే నిజంగా తీవ్ర నిరాశే!

ప్రస్తుతం యూరాలజీ, కార్డియోథోరాసిక్, ఆంకాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల్లో ఏసీలు పని చేయకపోవడం వల్ల మినిమమ్ స్థాయి సేవలు కూడా అందించలేని పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో బాధపడుతున్న రోగులు బయట నుంచి తమ ఇళ్ల ఫ్యాన్లను తెచ్చుకుని ఉష్ణోగ్రతను తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాడిపోయిన ఎండాకాలంలో, ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే రోగుల కోసం ప్రత్యేకంగా అందించాల్సిన సేవలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా రోజుకు ఐదు విభాగాల ద్వారా సుమారు 145 సర్జరీలు నిర్వహించే ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక్క సర్జరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రిని ఆశ్రయించిన రోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వైద్యులు కూడా చికిత్సల విషయంలో అయోమయంలో పడిపోతున్నారు.

అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని ఆసుపత్రిలో ఏసీ సమస్యను పరిష్కరించకపోతే, రోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రజా ఆరోగ్యానికి కేంద్రబిందువైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఈ స్థితికి చేరుకుందంటే, బాధ్యతాయుత పాలన అవసరమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది.

Tirumala: తిరుమల అలిపిరి సమీపంలో మరోసారి చిరుత కలకలం..

Exit mobile version