Site icon NTV Telugu

AI Girls: బూతులు మాట్లాడే అందమైన భామలు.. కామెడీ పేరుతో కామకథలు!

AI Girls Comedy

AI Girls Comedy

అందమైన అమ్మాయి…బూతులు మాట్లాడుతుంది. కామెడీ పేరుతో కామ కథలను చెబుతుంది. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఓపెన్ చేసిన ఇవే కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే లొల్లి. ఏఐ బొమ్మలు.. ఆర్టిఫీషియల్ మాటలు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూ ట్యూబ్…ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసినా ఏఐ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి.

ఆమె వేసుకున్న డ్రస్స్‌, కటౌట్‌…చూస్తే ఎవరికైనా మతి పోతుంది. ఇదేంటి ఇంత అందంగా ఉన్న అమ్మాయి బూతులు మాట్లాడుతోందని ఎవరికైనా అనుమానం రావడం ఖాయం. అనుమానం రావాలి కూడా. బాగా చదువుకున్న అమ్మాయిలేంటి…ఇంత వల్గర్‌ డైలాగ్స్‌ చెబుతున్నారని అనుకోవచ్చు. కానీ అదంతా ఏఐ మాయ.. అది బూతుల బొమ్మ. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ వీడియోలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లలో వైరల్‌ అవుతున్నాయి. ఎక్కడో స్టాండప్‌ కామెడీ తరహాలో నిలబడి జోకులు చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. కేవలం బికినీ వేసుకుని రోడ్లపై తిరుగుతూ ఇంటర్వ్యూలు చేస్తున్నట్టుగా తయారు చేస్తున్నారు. మహిళలు, యువతుల పాత్రలతో మహిళలను కించపర్చేలా, పురుషులపై ద్వంద అర్థాలతో సెటైర్లు వేస్తూ ఈ వీడియోలు సిద్ధం చేస్తున్నారు.

చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. దాదాపుగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్.. ఫేస్బుక్.. యూ ట్యూబ్ వాడుతున్నారు. అయితే వీటన్నింటిలో బీటా వర్షన్ తీసుకువచ్చి రీల్స్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. సో రీల్స్ పిచ్చి.. లైకుల మోజులో అనేక మంది డాన్సులు చేస్తున్నారు. కొందరైతే మితిమీరి సాహసాలు చేశారు. ఇదంతా మనం గతంలోనే చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. సోషల్ మీడియాలోకి ఏఐని ఎంటర్ చేశారు యూట్యూబర్లు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..కావాల్సిన ఇన్‌పుట్స్‌ ఇస్తే చాలు…అదే వీడియో, ఇమేజ్.. కావాలంటే ఆడియో ఇస్తుంది. ఇంకేంటి చిటికెలో వీడియో రెడీ అయిపోతుంది. ఇదంతా మంచికైతే సరే కానీ.. ఏఐతో సోషల్ మీడియాను గబ్బు చేస్తున్నారు కొందరు.

వాస్తవానికి కృత్రిమ మేధను సరిగ్గా వినియోగించుకుంటే వచ్చే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరదాకో, వైరల్‌ కావాలనో, కాసుల కక్కుర్తితోనో ఇలాంటి అశ్లీల వీడియోలను ఏఐతో రూపొందిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివాటిలో ఆదాయం పొందే అవకాశం ఉండటంతో చాలా మంది సృజనాత్మక వీడియోలు చేస్తున్నారు. కొందరు ప్రత్యేక నైపుణ్యాలతో లక్షలకొద్దీ సబ్‌స్ర్కైబర్లను, ఫాలోవర్లను సంపాదించుకుంటున్నారు. ఇది కాస్త శ్రమ, ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. తామూ ఫేమస్‌ కావాలని సామాజిక మాధ్యమాల్లోకి వస్తున్న మరికొందరు వికృతంగా వ్యవహరిస్తన్నారు. సబ్‌స్ర్కైబర్లు, వ్యూస్‌ పెద్దగా రాకపోవడంతో హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. మనుషుల లాగే ఉండే ఏఐ వీడియోస్ కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఓ అందమైన అమ్మాయి.. స్టాండ్ అప్ కామెడీ చేస్తూ కనిపిస్తుంది. అది కూడా ఏదో మంచి చేసిందా అంటే కాదు. ఓయో.. ఓయో అంటాడు తీరా ఓయోకెళ్తే రెండు నిమిషాల్లో పని కానిచ్చేసి.. బిర్యానీ తిని టీవీ చూస్తాడు అని అంటుంది. వాస్తవానికి ఈ వీడియో చూడగానే నిజంగానే అమ్మాయి మాట్లాడిందన్న అనుమానం వస్తుంది. కానీ అది ఏఐ జెనెరేటెడ్ వీడియో. ఇలా ఒకటి కాదు…రెండు కాదు…లక్షల వీడియోలను క్రియేట్ చేసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో బూతులు డైలాగ్స్‌ పెట్టి…ఫాలోవర్స్ కోసం నీచంగా వ్యవహరిస్తున్నారు.

ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హీరో.. హీరోయిన్స్ ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేశారు. వాటి ద్వారా శునకానందం పొందారు. కానీ ఇప్పుడు…ఏఐతో తాము హీరోయిన్స్‌కు ముద్దు పెడుతున్నట్టుగా.. హాగ్ చేసుకుంటున్నట్టుగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఇక న్యూస్ రిపోర్టింగ్‌ను ఇమిటేట్ చేస్తున్నారు. అమ్మాయిలకు.. అబ్బాయిలకు గలీజ్ క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా ఉన్న వీడియోలు అయితే సోషల్ మీడియా, యూట్యూబ్‌లో కోకొల్లలుగా దర్శనం ఇస్తున్నాయి.

స్త్రీల బాడీ పార్టీలను ఎక్సపోజ్ చేసేలా.. గలీజ్ కంటెంట్‌తో కామెంట్స్ చేస్తున్నారు. అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఒకరిద్దరు చేసిందేం కాదు…అనేక మంది సోషల్ మీడియా యూజర్స్ ఇలానే వ్యవహరిస్తున్నారు. డీప్ ఫేక్, మార్ఫింగ్, డీప్‌సీక్‌…ఇప్పుడు ఏఐ వచ్చాక ఈజీ అయిపోయింది. చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌లోనే అన్ని వచ్చేస్తున్నాయి. పైసా ఖర్చు లేదు. పని పాట ఏం లేదు ఇంకేం సోషల్ మీడియాలో గలీజ్ చేసేద్దాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అమ్మాయిలు.. అబ్బాయిల గురించి, అబ్బాయిలు…అమ్మాయిల గురించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్టుగా వీడియోలు పోస్టు చేస్తున్నారు.

అక్కడితో ఆగడం లేదు. ఏకంగా బెడ్ రూమ్ లో ఉన్నట్టుగా సెమీ పోర్న్ వీడియోస్ నే క్రియేట్ చేస్తున్నారు. ఏఐతో అమ్మాయిలు.. అబ్బాయిల్లా వీడియోస్ క్రియేట్ చేయడం పక్కన పెడితే.. ఏఐతో కార్టూన్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కార్టూన్స్ అంటే అవేవో మంచివి అనుకోకండి.. బండ బూతులు.. పచ్చి గలీజ్ మాటలు.. చూడాలంటేనే అసహించుకునే మాటలు.ఐటీ రంగంలో పనిచేస్తున్న కొందరు ఏఐ నిపుణులు, ఉద్యోగులు కాసుల కోసం ఇలాంటి ఏఐ వీడియోలు రూపొందిస్తూ జనం మీదికి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Exit mobile version