Site icon NTV Telugu

Vladimir Putin Fitness: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి.. 73 ఏళ్ల వయసులో కూడా..

Putin Fitness

Putin Fitness

Vladimir Putin Fitness: ప్రపంచం చూపు ఇప్పుడు భారతదేశం వైపు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటిస్తున్నారు. సాధారణంగా దేశాధినేతలు అనే వారు వివిధ దేశాలలో అధికారిక పర్యటనలు చేస్తుంటారు. కానీ అందరి అధ్యక్షులలోకెల్లా రష్యా అధ్యక్షుడు ప్రత్యేకం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. గురువారం భారత రాజధాని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. వాస్తవానికి పుతిన్‌కు 73 ఏళ్ల వయసు ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ఫిట్‌నెస్‌. ఈ స్టోరీలో ఆయన ఫిట్‌నెస్ సీక్రెట్ గురించి తెలుసుకుందాం.

READ ALSO: PM Modi: ‘‘ధ్రువ నక్షత్రం’’లా భారత్-రష్యా స్నేహం..

73 ఏళ్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ శక్తివంతమైన ప్రపంచ నాయకుడిగా విశేష ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. అయితే ఆయన బహుళ క్రీడా నిపుణుడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పుతిన్ క్రీడా ఆసక్తుల గురించి రష్యా అధ్యక్షుడి అధికారిక వెబ్‌సైట్ Kremlin.ru లో పలు విశేషాలు ఉన్నాయి. అక్టోబర్ 7, 1952న వ్లాదిమిర్ పుతిన్ లెనిన్‌గ్రాడ్‌లో జన్మించారు. ఆయన తన 11 సంవత్సరాల వయస్సు నుంచి జూడో ప్రాక్టీస్ చేస్తున్నాడని ఈ వెబ్‌సైట్ పేర్కొంది. పుతిన్ జూడోలో “మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్” బిరుదును పొందారు. జూడోపై తనకున్న ఆసక్తిని ఆయన అధికారిక వెబ్‌సైట్‌లో కూడా పేర్కొన్నారు. “నేను జూడో ప్రారంభించినప్పుడు, కేవలం బాలుడిని. నాకు మార్షల్ ఆర్ట్స్, వాటి ప్రత్యేక తత్వశాస్త్రం, సంస్కృతి, ప్రత్యర్థులతో సంబంధాలు, పోరాట నియమాలపై చాలా ఆసక్తి ఉండేది” అని పుతిన్ ఈ వెబ్‌సైట్‌లో వివరించాడు. ఆయన సెప్టెంబర్ 2006లో యూరోపియన్ జూడో యూనియన్ గౌరవ అధ్యక్షుడయ్యాడు, 2010లో దక్షిణ కొరియాలోని యోంగ్ ఇన్ విశ్వవిద్యాలయం నుంచి జూడోలో గౌరవ డాక్టరేట్ కూడా పొందాడు.

పుతిన్ సాంబో (సోవియట్ మూలానికి చెందిన మార్షల్ ఆర్ట్)లో అనేకసార్లు సెయింట్ పీటర్స్‌బర్గ్ ఛాంపియన్, అలాగే అదే క్రీడలో మాస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ కూడా. ఆయన కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు. పుతిన్‌కు స్కీయింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన చాలా కాలంగా పర్వత స్కీయింగ్ పై ఆసక్తి కలిగి ఉన్నారు. “ఇది గొప్ప క్రీడ, దీనికి టెక్నిక్‌పై పట్టు అవసరం. ఫిట్‌గా ఉండటానికి, శక్తిని, మంచి మానసిక స్థితిని పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశం” అని పుతిన్ చెప్పారు. సోవియట్ స్కీయింగ్ ఛాంపియన్ లియోనిడ్ త్యాగచెవ్ మాట్లాడుతూ.. ఈ క్రీడలో పుతిన్ టెక్నిక్ చాలా స్థిరంగా ఉందని, ఆయన చాలా ఎక్కువ వేగంతో పర్వతం దిగుతాడని చెప్పారు.

ఫిబ్రవరి 2011లో వ్లాదిమిర్ పుతిన్ టర్కీలోని వింటర్ యూనివర్సియేడ్‌లో పాల్గొనేవారికి తాను స్కేటింగ్ నేర్చుకుంటానని చెప్పారు. దీని తర్వాత వ్లాదిమిర్ పుతిన్ గోల్డెన్ పక్ యూత్ హాకీ ఫైనల్స్‌కు ముందు లుజ్నికిలో యువ ఆటగాళ్లతో కలిసి ఐస్ హాకీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఆయన ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు అలెక్సీ కసటోనోవ్ వద్ద రెండు నెలలు శిక్షణ కూడా పొందాడు. వారి సెషన్లు తరచుగా అర్ధరాత్రి తర్వాత జరిగేవి, పుతిన్ తన పనిని పూర్తి చేసిన తర్వాత ఈ శిక్షణలో పాల్గొనేవారు. వాస్తవానికి పుతిన్ ఫిట్‌నెస్‌కు క్రీడల పట్ల ఆయనకు ఉన్న ఆసక్తే కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా ఆయన ఇంత ఫిట్‌నెస్‌తో ఉండటానికి కారణం తరచుగా క్రీడాలలో పాల్గొనడమే అని పేర్కొన్నారు.

READ ALSO: Pushpa 2: జపాన్‌లో ‘పుష్ప 2’.. అక్కడికే ఎందుకు?

Exit mobile version