Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్‌ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..

Vizag School Tragedy

Vizag School Tragedy

Vizag School Tragedy: విశాఖపట్నంలో దారుణం వెలుగు చూసింది.. విశాఖ నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌ టీచర్‌ కొట్టడంతో ఆరేళ్ల విద్యార్థి మృతి చెందినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. లిటిల్‌ గార్డెన్స్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతుడిని ప్రణయ తేజగా గుర్తించారు. అతడు యూకేజీ విద్యార్థిగా కుటుంబ సభ్యులు తెలిపారు. టీచర్‌ దెబ్బలకు బాలుడు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. బాలుడిని కేజీహెచ్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

చిన్నారి మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు కేజీహెచ్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీచర్‌ దెబ్బల కారణంగానే బాలుడు మృతి చెందాడా? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారిక విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

అయితే, వైరల్‌గా మారిన ఓ వీడియో ప్రకారం మాత్రం.. తరగతి గదిలో అందరి క్లాస్‌ వర్క్‌ లేదా హోం వర్క్‌ చెక్‌ చేస్తున్న టీచర్‌ దగ్గరకు సదరు బాలుడు రగానే తీవ్రంగా ఏడవడం కనిపించింది.. వద్దు.. వద్దు అంటూ.. టీచర్‌ను బతిమిలాడుకున్నట్టుగా కనిపిస్తోంది.. కానీ, టీచర్‌.. అతడిని డ్రెస్‌ను సవరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఇంతలో ఆమె.. టై పట్టుకొని లాగడం.. బాలుడి చెప్పంపై ఓ దెబ్బ కొట్టడంతో.. వెంటనే ఆ బాలుడు.. టీచర్‌పైనే ఒరిగిపోయాడు.. ఆమె దూరం తీసి నిలబెట్టే ప్రయత్నం చేస్తే.. మళ్లీ పైకి ఒరిగాడు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. విద్యాబుద్ధులు నేర్పుతారని స్కూల్‌కు పంపిస్తే.. భయపెట్టి.. కొట్టి.. చంపేస్తారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.. అయితే, టీచర్‌ కొట్టడం వల్లే బాలుడు చనిపోయాడా? ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..