Fire Accident: విశాఖ HPCL రిఫైనరీ‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు..

Hpcl

Hpcl

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి ఆకాశంలోకి ఎగిసిపడిన దట్టమైన పొగ, మంటలు స్థానిక నివాసితులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.

రిఫైనరీలోని సల్ఫర్ పిచ్ ట్యాంక్‌లో ఈ మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ స్పందిస్తూ.. మంటలు కేవలం ఆ ఒక్క ట్యాంక్‌కే పరిమితమయ్యాయని, రిఫైనరీలోని ఇతర విభాగాలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను వేగంగా అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ అగ్నిప్రమాదంపై హెచ్‌పిసిఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫైర్ ఫైటర్లు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రించారని తెలిపింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. రిఫైనరీలోని మిగిలిన అన్ని యూనిట్లు సురక్షితంగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.