ప్రపంచ క్రికెట్ దిగ్గజం, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా ఖాళీగా కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం కొన్ని గంటల క్రితమే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా రికార్డు సృష్టించిన కోహ్లీ ఖాతా ఇలా మారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నిజానికి నిన్న అనలిటిక్స్ సంస్థ HypeAuditor, జనవరి 2026 నెలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్‌స్టాగ్రామ్ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 274.6 మిలియన్ల ఫాలోవర్లతో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచారు. ముఖ్యంగా ఎంగేజ్‌మెంట్ రేటులో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని కూడా కోహ్లీ అధిగమించడం విశేషం. కానీ గురువారం రాత్రికి విరాట్ కోహ్లీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ అయింది. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఖాళీగా దర్శనమిచ్చింది. పోస్ట్‌లు, ఫాలోవర్లు, మరియు ఫాలోయింగ్ సంఖ్య ఏమీ కనిపించకపోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ ప్రొఫైల్ కూడా ఇన్‌స్టాగ్రామ్ నుండి మాయమైంది. దీనితో అసలు ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ అయోమయానికి గురయ్యారు. ఈ పరిణామంపై ఇప్పటివరకు విరాట్ కోహ్లీ గానీ, ఆయన టీమ్ గానీ, భార్య అనుష్క శర్మ లేదా BCCI ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఖాతాలు హ్యాకింగ్‌కు గురవ్వడం లేదా టెక్నికల్ సమస్యల వల్ల తాత్కాలికంగా హైడ్ అయ్యే అవకాశం ఉంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తుందా అని కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
