NTV Telugu Site icon

Tanmay Srivastava: అప్పుడు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్‌

Tanmay Srivastava

Tanmay Srivastava

Tanmay Srivastava: క్రికెట్‌ అంటే కేవలం ఆటగాళ్ల మధ్య పోటీ మాత్రమే కాదు. ఎటువంటి తప్పులు జరగకుండా, నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను నిర్వహించడం కూడా అంతే ముఖ్యమైన అంశం. ఒక మ్యాచ్ సజావుగా సాగడానికి అంపైర్‌ పాత్ర ఎంతో కీలకమైనది. ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్ కలిసి ఆటను పర్యవేక్షిస్తుంటారు. అయితే, ఇప్పటి వరకు క్రికెట్‌ ఆడిన ఆటగాళ్లు ఆ తర్వాత కోచ్‌లు, కామెంటేటర్లుగా మారడం సహజమే. కానీ, ఐపీఎల్ 2025లో ఓ మాజీ ఆటగాడు అంపైర్‌గా కొత్త పాత్ర పోషించనున్నాడు. మరి ఆ వివరాలేంటో చూద్దామా..

Read Also: HCA : హెచ్‌సీఏలో నిధులు దుర్వినియోగం.. ఈడీ విచారణ..

ఐపీఎల్‌లో ఆడిన ఓ మాజీ క్రికెటర్ ఇప్పుడు అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అతనెవరో కాదు.. ఒకప్పటి విరాట్ కోహ్లీ సహచరుడు తన్మయ్ శ్రీవాస్తవ. ఈయన 2008లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టులో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆ టీమ్ ప్రపంచకప్ గెలిచింది. ఆ జట్టులోని విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మనీశ్ పాండే లాంటి ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుత విజయాలను సాధించారు. కానీ, అదే టోర్నమెంట్‌లో ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన శ్రీవాస్తవకు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం అందుకోలేకపోయారు.

శ్రీవాస్తవ దేశవాళీ క్రికెట్‌లో ఉత్తర ప్రదేశ్ తరఫున, అలాగే ఐపీఎల్ 2008, 2009 సీజన్లలో పంజాబ్ కింగ్స్ తరఫున కొన్ని మ్యాచులు ఆడాడు. అయితే, ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. దానితో తన్మయ్ శ్రీవాస్తవ ఇప్పుడు ఐపీఎల్ 2025లో అంపైర్‌గా వ్యవహరించనున్నాడు. అతను ఐపీఎల్‌లో ఆటగాడిగా ఆడి, ఇప్పుడు అంపైర్‌గా మారిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానం వీడాలనుకోడని, ఇక్కడ అతడి పాత్ర మాత్రమే మారిందని తెలుపుతూ.. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్‌ ది బెస్ట్ అంటూ రాసుకొచ్చింది.

Read Also: IPL 2025: పెద్ద ప్లానే.. 13 వేదికల్లో గ్రాండ్గా ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్న బీసీసీఐ

మొత్తంగా ఆటగాడిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టి, తర్వాత అంపైర్‌గా మారిన తొలి క్రికెటర్‌గా తన్మయ్ శ్రీవాస్తవ చరిత్ర సృష్టిస్తున్నాడు. క్రికెట్ అంటే కేవలం ఆటగాళ్ల కోసం మాత్రమే కాదు, న్యాయమైన నిర్ణయాలను తీసుకునే అంపైర్లదీ చాలా ప్రధాన పాత్ర. తన్మయ్ శ్రీవాస్తవ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం అతని కెరీర్‌కు కొత్త మలుపు తీసుకురావడం ఖాయం.