Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చెరగని ముద్ర వేసింది. 2008 ఏప్రిల్ 18న ప్రారంభమైన ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఫేమస్ డొమెస్టిక్ లీగ్‌గా మారింది. గత 18ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను ఎంటర్టైన్ చేస్తూ, ప్రతీ సీజన్‌లో అభిమానులను పెంచుకుంటూ పోతోంది. ఇక 2008 ఏప్రిల్ 18న కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరుతో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు తెర లేచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20ఓవర్లలో 222 పరగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కివీస్ బ్యాటర్ బ్రెండన్ మెక్కల్లమ్ ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. 73 బంతుల్లో ఏకంగా 158 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఆర్సీబీ ఛేదనలో 82 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే కేకేఆర్ తొలి విజయం అందుకున్న జట్టుగా నిలిచింది. అయితే.. ఈ 18 ఏళ్ల చరిత్రలో ఓ తిరుగులేని సూపర్ స్టార్ ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టు తరఫున ఆడుతున్నాడు. అతడు ఎవరో కాదు.. కింగ్ విరాట్ కోహ్లీ. 2008 నుంచి 2026 వరకు ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్ విరాట్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో విరాట్‌కు ఉన్న అనుబంధం విడదీయలేనిది. కష్టసుఖాల్లోనూ ఆ జట్టు వెంటే ఉంటూ కోహ్లీ ఒక నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచాడు.
READ MORE: Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇక పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వండి!
2008లో అండర్-19 ప్రపంచకప్ అందించిన జోష్‌తో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన విరాట్, అప్పటి నుంచి 2026 వరకు కేవలం ఒక్క ఆర్సీబీ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తుండటం అరుదైన రికార్డుగా చెప్పవచ్చు. ఇక 2013 నుంచి 2021 వరకు ఆర్సీబీ జట్టు పగ్గాలు కోహ్లీ చేపట్టాడు. తాను కెప్టెన్‌గా కొనసాగుతున్న 2016లో బెంగళూరును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. కానీ.. ఆర్సీబీకీ ఆ సీజన్‌లో కప్పు వరించలేదు. అయితే.. 2016 సీజన్‌లో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతం సృష్టించాడు విరాట్. ఒకే ఎడిషన్‌లో 973 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. అంతేకాదు.. ఐపీఎల్ కెరీర్‌లో 8000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ ఎన్నో శిఖరాలను అధిరోహించిన విరాట్ 2024 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకుని సూపర్ ఫామ్‌లో నిలిచాడు. ఇక గతేడాది ఆర్సీబీ కప్పు కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ 2026 సైతం కోహ్లీపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.
