Site icon NTV Telugu

T20 World Cup Records: నిన్నటి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ ఉంటే కథ వేరేలా ఉండేది.. రికార్డులు చెబుతున్న సత్యం ఇదే!

Virat Kohli

Virat Kohli

T20 World Cup Records: లక్షలాది మంది అభిమానులు విజయంపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఏ దశలోనూ ఆ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ లక్ష్యం 188 పరుగులు, కానీ ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మారి, క్రీజ్‌లో నిలిచి జట్టును గెలిపించలేకపోయాడు. టీమిండియా ఓటమి తర్వాత అభిమానుల మనసులో ఒక రూపం మెదిలిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఎవరో కాదు.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ.

READ ALSO: T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!

T20 ప్రపంచ కప్ చరిత్రలో, భారతదేశం 160 కంటే ఎక్కువ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది కేవలం మూడు సార్లు మాత్రమే. ఆశ్చర్యకరంగా, ఈ మూడు మ్యాచ్‌లలోనూ టీమిండియాను విజయపథంలో నడిపించింది.. విరాట్ కోహ్లీనే. మూడు సార్లను జట్టును గెలిపించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఈసారి టీమిండియా 188 పరుగులు చేసి ఉంటే, అది T20 ప్రపంచ కప్‌లో వారి అత్యధిక విజయవంతమైన పరుగుల వేటగా ఉండేది. అయితే, “ఛేజ్ మాస్టర్” కోహ్లీ లేకుండా ఇది సాధ్యం కాదని మరోసారి నిరూపితం అయ్యింది.

పిచ్ పరిస్థితులు – బ్యాటర్ల వైఫల్యం
భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వేదికైన మైదానం నల్లటి నేల పిచ్ కావడం, మంచు ప్రభావం లేకపోవడం వల్ల బంతి నెమ్మదిగా వస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో దూకుడు కంటే కూడా సహనం, సమయస్ఫూర్తి చాలా అవసరం అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో భారత జట్టులోని బ్యాటర్లు పరిస్థితులకు అనుగుణంగా ఆడటంలో విఫలమయ్యారని అన్నారు. సరిగ్గా ఇక్కడే ప్రపంచ క్రికెట్ దిగ్గజం, ‘ఛేజ్ మాస్టర్’ కింగ్ కోహ్లీ మనందరికీ గుర్తుకు వచ్చారు.

రికార్డులు చెబుతున్న సత్యం ఇదే..
T20 ప్రపంచ కప్ చరిత్రను తిరగేస్తే, భారత్ 160 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది కేవలం మూడు సార్లు మాత్రమే. విశేషమేమిటంటే, ఆ మూడు సార్లు విరాట్ కోహ్లీనే టీమ్ ఇండియాను గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు..

* 2014 (దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్): 173 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ (72* పరుగులు) ఒంటిచేత్తో జట్టును విజయపథంలో నడిపించాడు.

* 2016 (ఆస్ట్రేలియాపై): 161 పరుగుల వేటలో కోహ్లీ (82* పరుగులు) ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది.

* 2022 (పాకిస్థాన్‌పై): మెల్‌బోర్న్ మైదానంలో కోహ్లీ (82* పరుగులు) సృష్టించిన అద్భుతం ఎవరూ మర్చిపోలేరు.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రస్తుత జట్టు దూకుడుకు మారుపేరు. హార్దిక్ పాండ్యా, సూర్య వంటి హిట్టర్లు ఉన్నప్పటికీ, పిచ్ నెమ్మదించినప్పుడు వికెట్లు కాపాడుకుంటూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లే ‘కోహ్లీ మార్క్’ నిలకడ వారిలో లోపించిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే కాకుండా, సింగిల్స్ తీస్తూ ఒత్తిడిని అధిగమించే కోహ్లీ స్వభావం నేటి కుర్రాళ్లకు పాఠం లాంటిదని చెబుతున్నారు. మొత్తానికి దక్షిణాఫ్రికా మ్యాచ్ టీమిండియాకు ఒక విషయాన్ని స్పష్టం చేసిందని అంటున్నారు. ప్రతి బంతిని బలంగా బాదడమే టీ20 క్రికెట్ కాదని, ముఖ్యంగా పెద్ద టోర్నమెంట్లలో, ఒత్తిడి ఉన్నప్పుడు మ్యాచ్ పరిస్థితిని అర్థం చేసుకుని ఆడే ఆటగాడు జట్టుకు అవసరం అని ఈ పాఠం చెబుతున్నారు. భారత్ మళ్లీ ప్రపంచ విజేతగా నిలవాలంటే, కోహ్లీ వదిలి వెళ్లిన ఆ ‘బాధ్యత’ను భుజాన వేసుకునే మరో ఛేజ్ మాస్టర్ భారత జట్టుకు కావాలని అంటున్నారు.

READ ALSO: Kim Jong Un: 13 ఏళ్ల కుమార్తెకు కీలక బాధ్యతలు అప్పగించిన ఉత్తర కొరియా నియంత

Exit mobile version