Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..

Virat Kohli Gifts Jersey To Matt Henry

Virat Kohli Gifts Jersey To Matt Henry

Virat Kohli: క్రికెట్‌లో గెలుపు ఓటములు కామన్.. కానీ కొన్ని సందర్భాల్లో ప్లేయర్లు చూపించే క్రీడాస్ఫూర్తి (Sportsmanship) అందరి మనసులు గెలుచుకుంటుంది. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. న్యూజిలాండ్ (New Zealand) పేస్ బౌలర్ మాట్ హెన్రీ (Matt Henry) తన బౌలింగ్‌తో భారత జట్టును దెబ్బతీసిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని సైతం జీరో (0) పరుగులకే ఔట్ చేసినా.. మ్యాచ్ ముగిశాక హెన్రీకి విరాట్ తన జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ మైదానంలో టీమిండియాతో జరిగిన నాల్గో వన్డేలో (ODI Match) భారత్ 244 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో కీవీస్ పేసర్ మాట్ హెన్రీ కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు (6 Wickets) పడగొట్టి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ముఖ్యంగా మ్యాచ్ తొలి ఓవర్లోనే హెన్రీ సంచలనం సృష్టించాడు. ఫస్ట్ ఓవర్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)లను డకౌట్ (Duck out) చేసి పెవిలియన్‌కు పంపాడు. వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా ఇలా తొలి మూడు వికెట్లను ఒక్క పరుగు కూడా చేయకుండానే కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 5వ బంతికి హెన్రీ వేసిన అద్భుతమైన బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కేవలం 4 బాల్స్ ఆడిన కోహ్లీ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్‌ను కూడా గోల్డెన్ డకౌట్‌గా ఎల్బీడబ్ల్యూ (LBW) చేశాడు.

భారత భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్ (27 పరుగులు), అక్షర్ పటేల్ (21 పరుగులు), నమన్ ధీర్ (21 పరుగులు) కొద్దిసేపు పోరాడినప్పటికీ, ఎవరూ పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత హెన్రీ మళ్లీ బాల్ అందుకొని ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్ వికెట్లు తీసి తన వన్డే కెరీర్‌లోనే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ (Best Bowling Figures) నమోదు చేశాడు. హెన్రీ దెబ్బకు టీమిండియా లక్ష్యానికి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడిన మాట్ హెన్రీ.. తనకు అందిన ఈ అద్భుత విజయానికి గల కారణాలను పంచుకున్నాడు. అక్కడ వీస్తున్న బలమైన ఈదురుగాలులు (Strong Winds) బౌలింగ్‌కు చాలా సహకరించాయని, తన వ్యూహం చాలా సింపుల్‌గా ఉందని తెలిపాడు. గాలి వేగం కారణంగా స్వింగ్ గురించి పెద్దగా ఆలోచించలేదని, మొదటి బంతి నుంచి తన బలాన్ని నమ్ముకుంటూ స్టంప్స్‌ను టార్గెట్ చేశానని చెప్పాడు. కొత్త బంతితో బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని ముందే ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించాడు. తొలి బంతే చాలా వేగంగా టర్న్ అవ్వడంతో బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారిందని హెన్రీ చెప్పుకొచ్చాడు.