Viral Video: రద్దీగా ఉన్న రైలు బోగీలో ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. రైళ్లలో పరిశుభ్రత, ప్రయాణికుల ప్రవర్తనపై మరోసారి చర్చకు దారితీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన రైలు కోచ్ కనిపిస్తుంది. బెర్త్‌లపై ప్రయాణికులు కూర్చోవడంతో పాటు నేలపై కూడా భారీగా రద్దీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో ఓ వ్యక్తి కోచ్ మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది.
వీడియోతో పాటు చేసిన పోస్టు ప్రకారం.. కొందరు ప్రయాణికులు ఆ వ్యక్తిని ప్రశ్నించి, టాయిలెట్‌ను ఉపయోగించాలని సూచించినట్లు అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో అతడికి, ఇతర ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత కొందరు ప్రయాణికులు అతడిని నిలదీయగా పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒకరిద్దరు వ్యక్తులు అతడిపై చేయి చేసుకున్నట్లు కూడా దృశ్యాలు కనపడుతాయి. మరికొందరు ఈ ఘటనపై ఫిర్యాదు చేస్తామని చెప్పడం వినిపిస్తోంది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, రైలు నంబర్, ప్రయాణ తేదీ, సమయం వంటి అంశాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న ఘటనకు సంబంధించిన పరిస్థితులను ఇంకా నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు ఈ వీడియోపై రైల్వే సేవ కూడా స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైలు నంబర్, పీఎన్ఆర్ నంబర్, మొబైల్ నంబర్, ఘటన జరిగిన తేదీ, సమయం వంటి పూర్తి వివరాలను అందించాలని కోరింది.
ప్రయాణికులు తమ ఫిర్యాదును రైల్వే మదద్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించింది. అందిన వివరాల ఆధారంగా ఘటనపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే సేవ పేర్కొంది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా తప్పుబడుతుండగా, మరికొందరు ఘటనను చూసిన ప్రయాణికులు వెంటనే ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు రైళ్లలో ఇలాంటి ఘటనలకు పాల్పడే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనను పునరావృతం చేసే వారిపై ప్రయాణ పరిమితులు విధించే అంశాన్ని కూడా పరిశీలించాలని కొందరు సూచిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనను కేవలం ఓ వ్యక్తి ప్రవర్తనగా కాకుండా.. రైళ్లలో అధిక రద్దీ, ప్రయాణికుల ప్రవర్తన, పరిశుభ్రత వంటి అంశాలతో ముడిపెట్టి పలువురు చర్చిస్తున్నారు.
टीटी टिकट चेक कर रहा था, भाई ने सीधे चरित्र प्रमाण पत्र ही कैंसिल करवा लिया। 🤡 pic.twitter.com/LU1bmAHNnn
— खुरपेंची ढांचे (@Khurpenchinfra) September 26, 2026

