Site icon NTV Telugu

Viral News: వుడెన్ ట్రెడ్‌మిల్.. దీనికి కరెంట్ కూడా అవసరం లేదండోయ్

ఇటీవల సోషల్ మీడియాలో వుడెన్ ట్రెడ్‌ మిల్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. సహజంగా ఇంట్లోనే ఉండి వ్యాయమం చేసే పరికరాల్లో ముఖ్యమైనది ట్రెడ్‌మిల్. ఇది నడక, జాగింగ్, రన్నింగ్ వంటి వాటిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అత్యుత్తమ పరికరం. ఇలాంటి పరికరాన్ని ఓ వ్యక్తి ఇనుము, ఇతర లోహాలతో కాకుండా కేవలం చెక్కతో తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్‌ను తయారుచేసిన వ్యక్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.

చెక్కతో తయారు చేసిన వుడెన్ ట్రెడ్ మిల్ యాంత్రిక ట్రెడ్ మిల్‌లాగానే పని చేస్తుంది. ఈ వుడెన్‌ ట్రెడ్‌మిల్‌ ఉపయోగించడానికి కరెంట్‌, ఛార్జింగ్, బ్యాటరీ లాంటి ఏవి అవసరంలేదు. అతి తక్కువ ఖర్చుతో ఉపయోగకరమైన పరికరాన్ని తయారు చేసిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. అయితే ఈ వ్యక్తి తెలంగాణకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వుడెన్‌ ట్రెడ్‌మిల్‌ను సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయారు. వావ్ అంటూ ట్విట్టర్‌లో తన స్పందన తెలియజేశారు. సదరు వ్యక్తి వివరాలు తెలుసుకోవాలని తెలంగాణ నూతన ఆవిష్కరణల ప్రోత్సాహక విభాగం టీ వర్క్స్‌కు సూచించారు. చెక్కలతో ట్రెడ్ మిల్ అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని తెలిపారు.

ఈ వుడెన్ ట్రెడ్‌మిల్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తుండగా.. కొందరు మాత్రం చెక్క ట్రెడ్‌మిల్ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్‌తో నడిచే ట్రెడ్‌మిల్‌తో పోలుస్తూ ఈ వుడెన్ ట్రెడ్‌మిల్ అంత సమర్థంగా పని చేయకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

https://ntvtelugu.com/yadadri-temple-development-is-unbelievable/
Exit mobile version