పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నగరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టం పేరుతో భారీ హింస జరిగింది. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న షంషేర్‌గంజ్ కూడా హింసతో అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మంది హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. హింస తర్వాత.. ఓ జాతీయ మీడియా బాధిత హిందూ కుటుంబాల వద్దకు చేరుకుంది. అక్కడ పరిస్థితిని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకుంది. హిందూ కుటుంబాలకు చెందిన వ్యాపారాలు, దుకాణాలు ధ్వంసమైనట్లు జాతీయ మీడియా తెలిపింది.
నిరసన కారుల గుంపు హిందూ ఇళ్లపై దాడి చేసి ధ్వంసం చేసింది. షంషేర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు దాదాపు 500 మీటర్ల దూరంలో ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. తాము పోలీసులకు ఫోన్లు చేసినా వాళ్లు స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి హింస చెలరేగిన తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ముర్షిదాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ఘటనపై స్థానికంగా నివాసం ఉంటున్న అమర్ భగత్ భార్య మంజు వివరాల ప్రకారం.. “ఆ దుండగులు మొదట ప్రధాన గేటును పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఇది సాధ్యం కాకపోవడంతో వారు వెనుక గేటును పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లోపల ఉన్న సైకిల్ విరిచేశారు. ఆ తర్వాత గదుల్లో ఉన్న సామాన్లను ధ్వంసం చేశారు. కుర్చీ, పరుపు, టీవీ నుంచి అన్ని ఖరీదైన గృహోపకరణాలు ధ్వంసం చేశారు. కొన్ని ఖరీదైన సామాన్లను తీసుకెళ్లారు. ఇల్లు మొత్తం శిథిలమైపోయింది.” అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
మా కుటుంబం మొత్తం వణుకుతూ దేవుడిని ప్రార్థిస్తున్నామని మంజు చెప్పింది. “మేము మా ప్రాణాలను పణంగా పెట్టి పైకప్పు మీద దాక్కున్నాము. మేము దేవుని నామం జపిస్తూ.. బిక్కుబిక్కుమంటూ ప్రార్థించాం. ఆ సమయంలో నా కూతురికి ఇంట్లోనే ఉంది. ఆమెకు ఏమైనా జరిగినా.. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. సంఘటన జరిగిన సమయంలో నా భర్త, కొడుకు కూడా ఇంట్లో లేరు. వాళ్లు దుకాణంలో ఇరుక్కు పోయారు. ఆ ప్రదేశంలో పోలీసులు కూడా లేరు. నా కూతురికి ఏదైనా జరిగి ఉంటే.. పోలీసులు నా కూతురి గౌరవాన్ని తిరిగి ఇచ్చేవారా? అంతా నాశనమైన తర్వాత, పోలీసులు వచ్చారు. పోలీస్ స్టేషన్ కొన్ని నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ ఈ ఘటన జరిగింది.” అని మంజు విలపిస్తూ సమాధానమిచ్చింది.
కాగా.. ముర్షిదాబాద్ హింసలో 10 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. పోలీసు వాహనాలు కూడా తగలబెట్టారు. స్థానిక ప్రజల వివరాల ప్రకారం.. శుక్రవారం మజీద్‌లో ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ముస్లింలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రోడ్డు మీదకు వచ్చారు. ఇంతలో, ఒక పోలీసు వ్యాన్ అటుగా వెళుతుండగా నిరసన కారులు ఆ వ్యాన్ పై తమ కోపాన్ని వెళ్లగక్కారు. భారీగా రాళ్లు రువ్వారు. దీని కారణంగా పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు 12వ జాతీయ రహదారిని దిగ్బంధించి, పోలీసు వ్యాన్‌పై రాళ్లు రువ్వారు. అనేక మంది అమాయకుల వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.