సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. కిరణ్ అబ్బవరం, కశ్మీర పర్ధేశీ జంటగా నటిస్తున్నఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రశాంత్ నీల్, కిషోర్ తిరుమల దగ్గర మురళీ కిశోర్ దర్శకత్వ శాఖలో పనిచేశారు. జులై 15న హీరో కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్‌లో ఉన్న పోస్టర్ అందరినీ అలరించింది. తాజాగా వచ్చిన టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది. ‘నా పేరు విష్ణు. మా ఊరు తిరుపతి. మరి కొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ. ఇప్పుడు నా కథ ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసా’ అని కిరణ్ చెప్తుండగానే ‘హ్యాపీ బర్త్ డే విష్ణు’ అంటూ టీజర్ ముగుస్తుంది.
ఇందులో కిరణ్ మాస్ లుక్ తో ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా బాబు వ్యవహరిస్తున్నారు. సత్య గమిడి, శరత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.