C.P. Radhakrishnan: విజయవాడ పున్నమి ఘాట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025లో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పాల్గొన్నారు. నగర ప్రజల మనసు హత్తుకునేలా ప్రసంగించారు. ప్రారంభంలో అందరికీ “తెలుగు భాషలో నమస్కారం” చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉపరాష్ట్రపతి, తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయి. సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.
READ MORE: Taliban vs America: అమెరికాతో యుద్ధానికి సై అంటున్న తాలిబన్లు.. ఇంతకీ వీళ్ల బలం ఏంత?
విజయవాడ ఉత్సవ్ మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగాలని ఆకాంక్షించిన ఆయన, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తుచేశారు. “దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకం. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సంప్రదాయం భారతీయుల అదృష్టం. ఇది సాంప్రదాయానికి, సంస్కృతికి అద్దం పడుతోంది” అని పేర్కొన్నారు. మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయి అని ఉపరాష్ట్రపతి చెప్పారు. విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ.. “విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్. రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోంది” అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై సైతం స్పందించారు. “విద్య, వైద్యం రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోంది. వికసిత భారత్ అనేది ఒక కల కాదు, అది నిజం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోంది” అని అన్నారు.
ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన విజయవాడకే రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, విజయవాడలో అద్భుతమైన గౌరవం లభించిందన్నారు. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణం. కనకదుర్గ అమ్మ పేరులోనే అనుగ్రహం, ప్రేమ, అమృతం నిక్షిప్తమై ఉందని భావోద్వేగంగా తెలిపారు. మంత్రులు, అధికారులు అందరూ కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక, ఉత్సవ వేదికపై గాయని గీతా మాధురి పాడిన పాటలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.
