Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్‌ వద్ద ఉద్రిక్తత!

Ap Secretariat Employees

Ap Secretariat Employees

విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్‌ వద్ద నిరసన చేపట్టేందుకు సచివాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే బైఠాయించి సచివాలయ ఉద్యోగులు నిరసన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల కళ్లుగప్పి సచివాలయ ఉద్యోగులు అంచెలంచెలుగా ధర్నా చౌక్‌ వైపు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగులను పోలీసులు అడ్డుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఒక్కసారిగా ధర్నా చౌక్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ సమస్యలకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతుందో స్పష్టంగా లిఖితపూర్వక హామీ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటివరకు తమ నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ధర్నా చౌక్ వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గత ఏడు సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పటికీ తమకు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ప్రయోజనాలు అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించామని ఉద్యోగులు తెలిపారు. శాంతియుతంగా తమ సమస్యలపై పోరాడేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరినా.. అనుమతుల విషయంలో తాత్సారం చేసి చివరకు నిరాకరించారని వారు ఆరోపిస్తున్నారు.