NTV Telugu Site icon

Jeevan Case: ఇన్‌స్టా పోస్ట్‌ పెట్టిన 8 గంటల్లోనే.. అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

Jeevan

Jeevan

Jeevan Case: ఈఎంఐ డబ్బులు కట్టమని తన కొడుకుకు ఓ తండ్రి 12 వేల రూపాయలు ఇవ్వగా.. అతను తన అవసరాలకు వాడుకున్నాడు. ఆ విషయం తెలిసిన తండ్రి.. కొడుకుని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒకరోజంతా బయట ఉండి తెల్లారి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రికే స్నేహితుడి పుట్టినరోజు ఉందని చెప్పి బయటకు వచ్చి.. ఇన్​స్టాలో ఇదే తన చివరి రోజంటూ పోస్ట్​ పెట్టాడు. అది పెట్టిన 8గంటల్లోనే విగతజీవిగా మారిపోయాడు. ఇది విజయవాడ శివార్లలో వెలుగు చూసింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితి­లో ఉండటం అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్‌ వాచ్‌మేన్‌గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్‌(21) విజయవాడ వన్‌టౌన్‌లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్‌ మిత్రుడు శ్యామ్‌ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌నగర్‌ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్‌.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్‌ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు.

అసలేం జరిగిందంటే.. ఇటీవల లోన్‌ తాలూకూ ఈఎంఐ కట్టమని జీవన్‌కు తండ్రి రూ. 12 వేలు డబ్బులు ఇచ్చాడు. అయితే జీవన్​ ఆ డబ్బును వివిధ అవసరాలకు ఖర్చు చేశాడు. ఈ సంగతి తెలిసి రెండు రోజుల క్రితం తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి స్నేహితుడి ఇంట్లోనే పడుకున్నాడు. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చాడు. సాయంత్రం స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ ఉందని ఇంట్లో తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఆ సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బహుశా.. “ఇదే నా చివరి రోజు” అని పోస్టు పెట్టాడు. దీనిని చూసిన ఓ స్నేహితుడు వెటకారంగా పోస్టు చేశాడు. ‘సరేలే.. ఈరోజు రాత్రికి తెలుస్తుందిలే’ అని అందుకు సమాధానం పెట్టాడు. ఆ తర్వాత.. స్నేహితుడు శ్యామ్‌ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌ కాలనీలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇతను తల్లి నాగమణికి ఫోన్‌ చేసి మామూలుగానే మాట్లాడాడు. పార్టీ ముగిశాక 11 గంటలకు ఇంటికి రానని తెలిపాడు. పార్టీ అనంతరం స్నేహితులతో కలసి అక్కడే నిద్రపోయారు. హఠాత్తుగా 12.30 గంటల సమయంలో స్నేహితుడిని నిద్రలేపి, ద్విచక్ర వాహనం తాళాలు తీసుకుని బయటకు వచ్చాడు.

Read Also: Flexi War: తణుకులో వేడెక్కిన రాజకీయం.. 12 కిలోమీటర్ల మేర పోటాపోటీగా వైసీపీ-టీడీపీ ఫ్లెక్సీలు

జీవన్‌ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్‌ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్‌ బంక్‌ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్‌ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్‌ బంక్‌ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ‘నాన్నను నేను సంతోషపెట్టలేకపోతున్నా.. నేను ఎప్పుడూ మిమ్మల్ని నిరాశపరుస్తూనే ఉన్నా.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.. నన్ను భరించినందుకు కృతజ్ఞతలు అమ్మా.. అని ఫోన్‌ పెట్టేశాడు. తర్వాత మూడు సార్లు ఫోన్‌ చేసినా జీవన్‌ ఎత్తలేదు. అక్కడి నుంచి పెదపులిపాక వెళ్లి పెట్రోల్‌ను తలపై పోసుకుని నిప్పంటించుకుని ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పెట్రోల్‌ బంకు నుంచి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయలుదేరినట్లుగా ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో నమోదైంది. ప్రాథమికంగా ఆత్మహత్య అయి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ కేసును పెనమలూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జీవన్‌ మృతదేహం వద్ద ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.