NTV Telugu Site icon

VijayaSaiReddy: పేపర్ లీక్ చేస్తే ‘పద్మశ్రీ’ ఇవ్వాలా ఏంటి బాబూ..?

Vijayasai Reddy

Vijayasai Reddy

టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ నేతలు ముక్త కంఠంతో ఖండించారు. ప్రభుత్వం కక్షపూరితంగానే నారాయణను అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రభుత్వం తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. మాస్ కాపీయింగ్, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నారాయణను ఎలా బాధ్యుడ్ని చేస్తారని ప్రశ్నించారు.

అయితే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ అని ప్రశ్నించారు. చంద్రబాబు అండతోనే నారాయణ అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. పేపర్ల లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావంటూ చంద్రబాబును విజయసాయిరెడ్డి నిలదీశారు.

ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు చంద్రబాబుకు వినపడటం లేదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అందుకేనా నారాయణకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెట్టారంటూ మండిపడ్డారు. కాగా టెన్త్ పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.