NTV Telugu Site icon

Video call delivery : త్రీ ఇడియట్స్ సీన్ రిపీట్.. అది రీల్.. ఇది రియల్

Jammu Woman

Jammu Woman

Video call delivery: త్రీ ఇడియట్స్ సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో అమీర్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ సాయంతో ఓ మహిళకు డెలివరీ చేసే సీన్ పెద్ద హిట్. అది చూసిన వాళ్లంతా వావ్ అనుకున్నారు. అది సినిమాల్లోనే సాధ్యం అనుకున్నాం.. కానీ పెరిగిన సాంకేతిక అభివృద్ధితో అచ్చం అలాంటి సీన్‌ రియల్ గా జరిగింది. ఇది భారత్ ఉత్తరాది జమ్ముకశ్మీర్‌లో రిపీట్‌ అయింది. గైనకాలజిస్ట్‌ సూచనలతో కేరణ్‌లో కూడా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) సిబ్బంది కాన్పు చేశారు. మంచు కురుస్తున్న సమయంలో మరో పట్టణానికి వెళ్లలేని పరిస్థితుల్లో వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా శనివారం డెలివరీ చేశారు.

Read Also: PVN Madhav: బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్

వివరాల్లోకి వెళితే.. జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని కేరణ్‌ సీహెచ్‌సీకి శుక్రవారం ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని కుటుంబీకులు తీసుకొచ్చారు. ఆమెను జాయిన్‌ చేసుకున్న సిబ్బంది.. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో దగ్గర్లోని మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే, పెద్ద ఎత్తున మంచు కురుస్తుండటంతో బయటి ప్రాంతానికి వెళ్లే దారులన్నీ మూసుకుపోయి ఉన్నాయి. దాంతో వారు తమకు తెలిసిన క్రాల్‌పురాకు చెందిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ పర్వేజ్‌ను సంప్రదించారు. ఫోన్‌ చేసి పరిస్థితిని వివరించారు. అనంతరం వాట్సాప్‌ వీడియోకాల్‌లో ఆ గైనకాలజిస్ట్‌ సూచనల మేరకు ఆ సీహెచ్‌సీలోనే డాక్టర్‌ అర్షద్‌ సోఫితో కలిసి అక్కడి పారామెడికల్‌ సిబ్బంది శనివారం ఉదయం ప్రసవం చేశారు. 6 గంటల తర్వాత మహిళ ఆరోగ్యవంతమైన పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు సీహెచ్‌సీ సిబ్బంది తెలిపారు.

Read Also: Prabhas: మొహమాటానికి పోయి సినిమాలు చేయకు ప్రభాస్ అన్నా..?

Show comments