Vemulawada Temple Karthika Masam 2026: కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నెలరోజుల పాటు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. కార్తీక సోమవారాలు, పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అయితే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాన ఆలయంలో స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోనూ నెలరోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కార్తీక మాసంలోని ప్రతి సోమవారం ప్రధాన ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి ఏకాంతంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలోనూ స్వామివారికి రుద్రాభిషేకం జరపనున్నారు. ఈ నెల 21వ తేదీన కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీకృష్ణ తులసి కల్యాణం జరగనుంది. అలాగే నవంబర్ 24న కార్తీక పౌర్ణమి, వైకుంఠ చతుర్దశి సందర్భంగా ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అన్నపూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కార్తీక పౌర్ణమి రోజున శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి ప్రధాన ఆలయంలో నిషిపూజ అనంతరం ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కార్తీక మాసంలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రధాన ఆలయంలో స్వామివారికి ఏకాంతంగా పూజలు కొనసాగనున్నాయి. భక్తులు ఆలయ అధికారుల సూచనలు పాటిస్తూ దర్శన ఏర్పాట్లకు సహకరించాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి.

