ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నలకు జపాన్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల అక్కడ ‘పుష్ప 2’ విడుదల సందర్భంగా ఈ జోడి జపాన్‌లో సందడి చేసింది. ఈ పర్యటనలో ‘కజు’ అనే ఒక జపనీస్ అభిమాని అల్లు అర్జున్, రష్మికలను ఇంటర్వ్యూ చేస్తూ, అనూహ్యంగా తెలుగులో మాట్లాడి వారిని ఆశ్చర్యపరిచాడు. అర్జున్ అతనితో జపనీస్‌లో మాట్లాడటానికి ప్రయత్నించగా, ఆ అభిమాని మాత్రం.. ‘మీరు తెలుగు సినిమాలకే గర్వకారణం. నేను తెలుగు నేర్చుకుంటున్నాను, దయచేసి నా తెలుగును భరించండి’ అని స్వచ్ఛమైన తెలుగులో అనడంతో బన్నీ, రష్మిక ఒక్కసారిగా అవాక్కయ్యారు.
Also Read : Amardeep : “సుమతీ శతకం” నుండి మెలోడియస్ అప్‌డేట్..
ఆ అభిమాని అనర్గళంగా తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతుంటే, రష్మిక ఆనందంతో చప్పట్లు కొట్టింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఒక అడుగు ముందుకు వేసి.. “నీ తెలుగు చాలా బాగుంది, నువ్వు ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవాలి” అని సరదాగా అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. దీనికి సంబంధించిన వీడియోను కజు తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ.. ‘భారతదేశ అగ్ర నటులను ఇంటర్వ్యూ చేసే గౌరవం దక్కినందుకు కృతజ్ఞుడను’ అని రాశాడు. ప్రస్తుతం ఈ ‘తెలుగు-జపాన్’ సంభాషణ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తెలుగు భాష గొప్పతనం ఖండాంతరాలు దాటిందంటూ మెగా అభిమానులు గర్వంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
