Site icon NTV Telugu

Uttam Kumar Reddy : తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. ఏడాదిన్నర కృషి ఫలించింది

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్‌ రంగంలో భారీ ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు , సీతమ్మ సాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిన్నర పాటు చేసిన కృషి ఫలించి, ఇప్పుడు గోదావరి జలాల వినియోగానికి భారీ స్థాయిలో అవకాశం లభించినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు గోదావరి నదీ జలాల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సీతారాం సాగర్ ద్వారా 68 టీఎంసీల గోదావరి నీరు లభించనుంది. ఇది సుమారు 8 లక్షల ఎకరాల సాగు భూములకు ఉపయోగపడనుంది. ఈ అనుమతులు తెలంగాణ ఇరిగేషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తాయని ఉత్తమ్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ కూలిపోయిన నేపథ్యంలో, సీతమ్మసాగర్ బ్యారేజి నమ్మకంగా నిలబడుతుందా అని కేంద్ర జలవనరుల శాఖ ప్రశ్నించింది. తగిన అన్ని సాంకేతిక వివరాలు పంపిన తర్వాతే CWC (Central Water Commission) అనుమతి ఇచ్చింది. అలాగే పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరగబోయే ముంపు నష్టాన్ని నివారించేందుకు ప్రొటెక్షన్ వాల్ కోసం కేంద్ర నిధులు కోరినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించిందని చెప్పారు.

గత ప్రభుత్వం కృష్ణా జలాల పంపకంలో తెలంగాణ రైతులకు అన్యాయం చేశారని, న్యాయం కోసం ట్రిబ్యునళ్ల వద్ద వాదిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. అంతరాష్ట్ర సమస్యలపై ప్రభుత్వం సీరియస్‌గా పని చేస్తోందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో BRS ప్రభుత్వం చేసిన అవినీతిని, నాణ్యత లోపాలను ఎత్తిచూపుతూ.. వాళ్ళే కట్టారు.. వాళ్ళ హయాంలోనే కూలింది అంటూ విరుచుకుపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం లాంటి ప్రాంతాలు ప్రమాదంలో ఉన్నట్లు NDSA నివేదిక ద్వారా తేలిన విషయాలను ప్రజలు గుర్తించాలన్నారు.

లక్ష కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో కూడా అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. NDSA నివేదికలో వెల్లడైన అవినీతి ఆరోపణలు తెలంగాణ ప్రజలకు మేల్కొలుపు కావాలని పిలుపునిచ్చారు.

Komitreddy Venkat Reddy : కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు

Exit mobile version