Site icon NTV Telugu

US winter storm: అమెరికాను కుదిపేస్తున్న మంచు తుఫాన్.. 29 మంది మృతి, అంధకారంలో లక్షలాది ఇళ్లు!

Us Snow Strom

Us Snow Strom

US winter storm: అమెరికాలో శక్తివంతమైన మంచు తుఫాన్ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. ఈ భయంకర తుఫాన్ కారణంగా ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీగా మంచు కురవడంతో పాటు తీవ్రమైన చలి నెలకొంది. మంచు ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. రహదారి, విమాన ప్రయాణాలు స్తంభించడం వల్ల లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Stock Market: రుచించని భారత్-ఈయూ డీల్.. భారీ నష్టాల్లో సూచీలు

అందిన నివేదికల ప్రకారం.. సోమవారం తుఫాన్ చివరి దశ తూర్పు దిశగా కదలడంతో ఈశాన్య రాష్ట్రాల్లో మంచు మరింత పేరుకుపోయింది. దీంతో చెట్లు కూలిపోవడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం జరిగి లక్షలాది మంది చీకట్లో ఉండిపోవాల్సి వస్తుంది. ఆర్కాన్సాస్ నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు తుఫాన్ పెరిగే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. ఈ తుఫాన్ తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే.. దాదాపు 1,300 మైళ్ల పొడవైన ప్రాంతంలో ఒక అడుగుకు మించిన మంచు పొర ఏర్పడింది. ఫలితంగా అనేక హైవేలు మూసివేయాల్సి వచ్చింది. వేలాది విమానాలు రద్దయ్యాయి. పెద్ద సంఖ్యలో పాఠశాలలను కూడా మూసివేశారు. నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. పిట్స్‌బర్గ్ ఉత్తర ప్రాంతాల్లో 20 ఇంచుల వరకు మంచు కురిసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వరకు ఉష్ణోగ్రత సున్నా నుంచి మైనస్ 25 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు పడిపోయింది.

తుఫాన్ కారణంగా అనేక రాష్ట్రాల్లో ప్రాణనష్టాలు సంభవించాయి. మసాచుసెట్స్, ఓహియో రాష్ట్రాల్లో మంచు తొలగించే స్నోప్లో వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఆర్కాన్సాస్, టెక్సాస్ రాష్ట్రాల్లో మంచుపై జారుతూ (స్లెడ్జింగ్) జరిగిన ప్రమాదాల్లో మృతి చెందారు. సోమవారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా 6 లక్షల 70 వేలకుపైగా ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వారంపాటు కురిసిన వర్షాల కారణంగా చెట్ల కొమ్మలు, విద్యుత్ లైన్లు తెగిపోయాయి.

మిలానో కార్టినా 2026 కోసం Samsung Galaxy Z Flip7 ఒలింపిక్ ఎడిషన్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

న్యూయార్క్ సిటీలో గత ఎన్నో సంవత్సరాల తర్వాత అత్యధికంగా మంచు కురిసింది. సెంట్రల్ పార్క్‌లో 11 ఇంచుల మంచు నమోదైంది. తుఫాన్ అనంతరం ఏర్పడిన తీవ్రమైన చలి పరిస్థితులను మరింత ప్రమాదకరంగా మార్చింది. మిడ్‌వెస్ట్, దక్షిణం, ఈశాన్య ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా కంటే దిగువకు పడిపోయాయి. ఎన్ఓఏఏ మాజీ శాస్త్రవేత్త రాయన్ మౌ మాట్లాడుతూ.. 2014 తర్వాత అమెరికాలోని దిగువ 48 రాష్ట్రాలు అత్యల్ప సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతల దిశగా వెళ్తున్నాయని తెలిపారు. అధికారులు లూసియానా, పెన్సిల్వేనియా, టెన్నెసీ, మిసిసిప్పి, న్యూజెర్సీ రాష్ట్రాల్లో తుఫాన్ కారణంగా మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. న్యూ ఇంగ్లాండ్‌లో కొంత మేర తక్కువ నుంచి మధ్యస్థాయి మంచు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, తీవ్ర చలి ఇప్పటికీ పెద్ద ప్రమాదమే అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version