Site icon NTV Telugu

Trump Tariffs: టారిఫ్ వార్‌కు బ్రేక్.. ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో బిగ్ షాక్‌..

Trump Tariffs

Trump Tariffs

Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ఇతర దేశాలపై ఇష్టానుసారం టారిఫ్‌లు పెంచుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు భారీ దెబ్బ తగిలింది. ఇతర దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి చట్టబద్ధమైన అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల కోసం ఉన్న చట్టాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడం అధికార దుర్వినియోగమేనని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6–3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అంటే తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతి పన్నులు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది.

READ MORE: Rao Bahadur: మహేష్ బాబు ప్రెజెంట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

1977లో వచ్చిన ఈ చట్టం అధ్యక్షుడికి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్యాన్ని నియంత్రించే అవకాశం ఇస్తుంది. అయితే సుంకాలు విధించే హక్కు గురించి స్పష్టంగా ఎక్కడా చెప్పలేదని కోర్టు పేర్కొంది. అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే కాంగ్రెస్ నుంచి స్పష్టమైన అనుమతి ఉండాలని న్యాయమూర్తులు తెలిపారు. అలాంటి అనుమతి చూపించలేకపోయారని వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఆర్థిక విధానాలకు పెద్ద దెబ్బగా మారింది. ముఖ్యంగా దిగుమతులపై అధిక పన్నులు వేసి దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయాలన్న ఆయన ప్రణాళికపై ప్రభావం పడింది. అదనంగా విధించిన సుంకాలను తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. భారత్‌పై విధించిన 18శాతం టారిఫ్‌ కూడా అనధికారమని అమెరికా సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో భారత్‌కు సైతం మేలు చేకూరనుంది.

Exit mobile version