US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధం ఇప్పుడు విమానయాన రంగానికి కూడా గట్టి దెబ్బే కొట్టేలా ఉంది. వచ్చే వారం నుంచి ఇరాన్‌కు చెందిన ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూతపడే పరిస్థితి వస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఇరాన్ విమానాలకు సేవలు అందించే విదేశీ కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. సెప్టెంబర్ 23 నాటికల్లా అంతర్జాతీయంగా ఇరాన్ విమానాల రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయడమే తమ లక్ష్యమని బెసెంట్ వెల్లడించారు. కేవలం ఇరాన్ ఎయిర్‌లైన్స్‌ను మాత్రమే కాకుండా, వాటికి సహకరించే విమానాశ్రయాలు, టికెటింగ్ ఏజెన్సీలు, ఇంధన సరఫరాదారులు, ల్యాండింగ్ సేవలు అందించే సంస్థలను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ విమానాలకు ఎవరు సేవలు అందించినా, లేదా వాటికి టికెట్లు అమ్మినా సరే… వాళ్లను అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ (డాలర్ సిస్టమ్) నుంచి పూర్తిగా బయటకు గెంటేస్తామని కఠినంగా చెప్పారు. అంటే వారితో వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తామన్నమాట.
డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ఆర్థిక యుద్ధంలో ఇది మరొక పెద్ద అడుగు. గతంలోనే ఇరాన్ విమానయాన రంగాన్ని దెబ్బతీసేలా అనేక ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా, ఇటీవల మిగిలి ఉన్న అన్ని ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై కూడా ఆంక్షల వేటు వేసింది. ఇరాన్ విమానయాన రంగానికి సహకరిస్తున్న దేశ విదేశీ సంస్థలను సైతం ఇందులో చేర్చింది. ఈ వార్నింగ్ దెబ్బకు పలు దేశాలు ముందే అప్రమత్తమై ఇరాన్ విమానాలపై నిషేధం విధిస్తున్నాయి. ఇరాన్ ఎయిర్‌లైన్స్ విమానాల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఇరాక్ ప్రకటించింది. ఇటు జార్జియా కూడా ఇరాన్ విమానాలను తమ గగనతలంలోకి అనుమతించమని తేల్చిచెప్పగా, తుర్కియే విజ్ఞప్తి మేరకు ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులను అక్కడ నిలిపివేసింది. ఏళ్ల తరబడి విదేశీ ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్ విమానయాన రంగానికి కొత్త విమానాలు, స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్ పొందడం ఇప్పటికే తీవ్ర కష్టంగా మారింది.
ఈ హెచ్చరికల వెనుక మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. చైనా వైస్ ప్రీమియర్ హే లీఫెంగ్‌తో స్కాట్ బెసెంట్ సమావేశమైన మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. త్వరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇరాన్‌కు చైనానే అతిపెద్ద ఆర్థిక, దౌత్య భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఇరాన్ సుప్రీం లీడర్, ఇతర కీలక సైనిక అధికారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఇది ఇప్పుడు ఏడో నెలకు చేరుకుంది. దానికి ప్రతికారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ముడిచమురు ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధం ప్రారంభంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసినప్పటికీ, ఆ తర్వాత కేవలం తమ దేశీయ విమానాలకు మాత్రమే పరిమితంగా అనుమతులు ఇచ్చింది. అయితే ఇప్పుడు అమెరికా తెచ్చిన కొత్త ఆంక్షల ముప్పుతో ఇరాన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదంలో పడ్డాయి.

