Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బతగిలింది. ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్‌కు 200 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలనే ట్రంప్ నిర్ణయాన్ని శనివారం ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ నిర్ణయాన్ని అక్టోబర్ 18 వరకు ముందుకు కదపడానికి వీలు లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత నియమితులైన అమెరికా జిల్లా న్యాయమూర్తి కరిన్ ఇమ్మెర్గట్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. పోర్ట్‌ల్యాండ్‌లో నిరసనలు “తిరుగుబాటు” స్థాయికి పెరిగాయని లేదా శాంతిభద్రతలకు ఈ నిరసనలు తీవ్రంగా ఆటంకం కలిగించాయనే ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.
READ ALSO: Chiranjeevi : చిరు-అనిల్ సినిమాలో కాంట్రవర్సీ నటుడే విలన్..?
ట్రంప్ పరిపాలనను నిందించిన ఒరెగాన్ గవర్నర్..
ట్రంప్ పరిపాలన చర్యను ఒరెగాన్ అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ కోర్టులో సవాలు చేశారు. ట్రంప్ నిర్ణయం రాష్ట్ర స్వయంప్రతిపత్తిపై దాడి అని, అది సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఒరెగాన్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 2020లో ఫాక్స్ న్యూస్లో వచ్చిన హింసాత్మక నిరసనల వీడియోలను చూసిన తర్వాత ట్రంప్ ఈ ఉత్తర్వు జారీ చేశారని, కానీ ప్రస్తుత నిరసనలు చిన్నవి, శాంతియుతంగా జరిగాయని కోర్టులో పేర్కొంది. ఈ నిరసనల్లో భాగంగా జూన్ మధ్యలో కేవలం 25 మందిని మాత్రమే అరెస్టు చేశారని, నాటి నుంచి మూడు నెలలుగా ఎవరినీ అరెస్టు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ ఉత్తర్వుపై అప్పీల్ చేస్తామని వైట్ హౌస్ తెలిపింది.
సౌత్ పోర్ట్‌ల్యాండ్‌లోని ICE ప్రధాన కార్యాలయం వెలుపల శనివారం సాయంత్రం నిరసనకారులు గుమిగూడి భద్రతా దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానీ పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. దేశీయ ఉగ్రవాదం నుంచి సమాఖ్య భవనాలను రక్షించడానికి నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలనే చర్య అవసరమని ట్రంప్ పరిపాలన చెబుతుండగా, ప్రతిపక్ష డెమొక్రాటిక్ నాయకులు మాత్రం దీనిని రాజకీయ జోక్యం, అధికార దుర్వినియోగం అని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా తాజా ఉత్తర్వులు మాత్రం ట్రంప్ సర్కార్‌కు ఎదురు దెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
READ ALSO: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్..
