US Clears F-16 Upgrade for Pakistan: పాకిస్థాన్‌కు అమెరికా గిఫ్ట్ ఇచ్చింది. పాక్ ఎఫ్-16 కు అమెరికా మరింత శక్తిని జోడించేందుకు అంగీకరించింది. పాకిస్థాన్ వాయుసేనకు చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణకు అమెరికా ఓకే చెప్పేసింది. పాక్ వార్తాపత్రిక డాన్ ప్రకారం.. ఈ ఒప్పందానికి సంబంధించి 686 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,700 కోట్లు) విలువైన ఒప్పంద ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేసింది. ఈ ప్యాకేజీపై కాంగ్రెస్ 30 రోజుల్లోగా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పరిణామంపై భారత్ నుంచి అభ్యంతరాలు రాకుండా అమెరికా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.. అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (DSCA) ఈ మేరకు కాంగ్రెస్‌లోని కీలక కమిటీలకు లేఖలు పంపింది. ఈ ఒప్పందం కింద పాకిస్థాన్‌కు చెందిన బ్లాక్-52, మిడ్-లైఫ్ అప్‌గ్రేడ్ F-16 విమానాలను ఆధునికీకరించనున్నారు.
READ MORE: Starlink India: భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్ మస్క్ ట్వీట్!
DSCAకి రాసిన లేఖలో “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాలతో కలిసి పనిచేస్తుంది. భవిష్యత్తులో పెద్ద వివాదం తలెత్తితే, పాకిస్థాన్ వైమానిక దళం అమెరికా వైమానిక దళంతో సులభంగా సమన్వయం చేసుకోగలదు. ఈ అమ్మకం దక్షిణాసియాలో సైనిక సమతుల్యతకు భంగం కలిగించదు. పాకిస్థాన్ ఇప్పటికే F-16లను కలిగి ఉంది. కాబట్టి అది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా ఉపయోగించుకోగలదు.” అని పేర్కొన్నారు. అయితే.. పాకిస్థాన్ దగ్గర దాదాపు 75 F-16 విమానాలు ఉన్నాయి. మే 2025 ఇండో-పాక్ వైమానిక యుద్ధంలో పాకిస్థాన్ J-10C, JF-17 వంటి మరిన్ని కొత్త విమానాలను ఉపయోగించింది. కానీ F-16 మాత్రం వెన్నెముకగా నిలిచింది. తాజాగా వచ్చిన ఈ అప్‌గ్రేడ్ పాత F-16లను మరో 15 సంవత్సరాలు ఎగరేలా అనుమతిస్తుంది. లింక్-16 లభ్యత పాకిస్థానీ పైలట్‌లు అమెరికన్ AWACS, యుద్ధ విమానాలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. దీంతో యుద్ధాల సమయంలో పాకిస్థాన్‌కి గణనీయమైన ప్రయోజనం కలగనుంది.
READ MORE: Rahul Gandhi: భయంతో తప్పుడు భాష మాట్లాడారు.. అమిత్ షా ప్రసంగంపై రాహుల్ గాంధీ అభ్యంతరం
లింక్-16 వంటి సున్నితమైన సాంకేతికత పాకిస్థాన్‌కు US-NATO స్థాయిలో సమాచారం, ఆదేశాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం అని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం భారతదేశం వద్ద లింక్-16 లేదు. భారత్ రష్యన్, ఇజ్రాయెల్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. 2019 బాలకోట్ దాడి తర్వాత.. పాకిస్థాన్ F-16 విమానాల విడిభాగాలను అమెరికా నిలిపివేసింది. తాజాగా ఇంత పెద్ద ప్యాకేజీకి అకస్మాత్తుగా ఆమోదం లభించడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
