NTV Telugu Site icon

Raquel Welch: రాలిన అందం… రాక్వెల్ వెల్చ్!

Raquel Welch

Raquel Welch

Raquel Welch Passes Away: హాలీవుడ్ అందాల తారల్లో తనదైన బాణీ పలికించిన రాక్వెల్ వెల్చ్ ఇకలేరన్న వార్త ఆమె అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. మొన్నటి దాకా ఎంతో చలాకీగా తిరిగిన రాక్వెల్ వెల్చ్ ఫిబ్రవరి 15న తన 82వ యేట తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకు డామన్ వెల్చ్, కూతురు తాహ్నీ వెల్చ్ ఉన్నారు. రాక్వెల్ మరణవార్త వినగానే హాలీవుడ్ లోని ఆమె అభిమానులు, సన్నిహితులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.

అమెరికాలోని ఇల్లినాయిస్ స్టేట్ చికాగోలో 1940 సెప్టెంబర్ 5న రాక్వెల్ వెల్చ్ జన్మించారు. ఆమె అసలు పేరు జో రాక్వెల్ టెజేడా. రాక్వెల్ రెండేళ్ళ పాపగా ఉన్నప్పుడు వారి కుటుంబం కాలిఫోర్నియాలోని శాన్ డీగోకు మకాం మార్చారు. జోల్లా హై స్కూల్ లో చదువుతున్న రోజుల్లో ‘ఫెయిరెస్ట్ ఆఫ్ ద ఫెయిర్’ గా పేరు సంపాదించింది రాక్వెల్. 1958లో హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాక్వెల్, అదే యేడాది స్టేట్ కాలేజ్ లో థియేటర్ ఆర్ట్స్ లో చేరింది. 1959లో తన స్కూల్ ‘స్వీట్ హార్ట్’ జేమ్స్ వేల్చ్ ను పెళ్ళాడింది. పెళ్ళయ్యాక నటిగా అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేసింది. లభించిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకున్నారామె. 1966లో తెరకెక్కిన “ఫెంటాస్టిక్ వొయేజ్’తో రాక్వెల్ కు మంచి గుర్తింపు లభించింది. ఆపై ఆమె నటించిన “సెక్స్ క్వార్టెట్, ఒన్ మిలియన్ ఇయర్స్ బి.సి., బిడేజిల్డ్” చిత్రాలతో సెక్స్ బాంబ్ గా పేరు సంపాదించారు రాక్వెల్. 1973లో ‘ద త్రీ మస్కిటీర్స్’లో రాక్వెల్ నటనకు ఉత్తమనటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఆ తరువాత సెక్స్ సింబల్ గా తనదైన బాణీ పలికిస్తూ రాక్వెల్ వెల్చ్ సాగారు. 2017లో ఆమె చివరి సారిగా ‘హౌ టు బి ఏ లాటిన్ లవర్’ చిత్రంలో కనిపించారు. నాటి మేటి హాలీవుడ్ నటులు ఫ్రాంక్ సినాట్రా, రాబర్ట్ వేగ్నర్, జేమ్స్ స్టివార్ట్, డీన్ మార్టిన్, బర్ట్ రేనాల్డ్స్ వంటి వారితో నటించి అలరించారు రాక్వెల్ వెల్చ్.

Keanu Reeves: ఇంతకూ… కీనూ రీవ్స్‌కు ఏమయ్యింది!?

జేమ్స్ వెల్చ్ తో ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగాక, విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ తన పేరులో వెల్చ్ నే కొనసాగించారు. ఆ తరువాత కూడా మరో మూడు మార్లు రాక్వెల్ వివాహం చేసుకున్నా, రాక్వెల్ వెల్చ్ గానే ఆమె సాగారు. ఏది ఏమైనా రాక్వెల్ వెల్చ్ అందం ఆ రోజుల్లో హిందోళం పాడుతూ కుర్రకారుకు బంధాలు వేసింది. హాలీవుడ్ పత్రికలో ‘100 సెక్సియెస్ట్ స్టార్స్ ఇన్ ఫిలిమ్ హిస్టరీ’ లో చోటు సంపాదించారామె. 1995లో ‘ఎంపైర్ మేగజైన్’ ప్రచురించిన ‘100 సెక్సియెస్ట్ స్టార్స్ ఆఫ్ ట్వంటీయెత్ సెంచరీ’లో మూడో ర్యాంక్ సాధించారామె. ఈ నాటికీ ఆ నాటి అభిమానుల కలల రాజ్యానికి రాణిగా సాగుతున్న రాక్వెల్ ను ఆమె చిత్రాలలోనే చూసుకోవాలి. అదే రాక్వెల్ కు ఫ్యాన్స్ అర్పించే అసలైన నివాళి!