Site icon NTV Telugu

UPSC Exam video: నిమిషం లేటు.. గేటు ముందే భోరుమన్న తల్లిదండ్రులు

Upsc

Upsc

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ప్రయోజకలు కావాలని.. ఉన్నత దశలో ఉండాలని కోరుకుంటారు. అంతేకాకుండా వారు తినకపోయినా.. పిల్లల కోసం సర్వం కోల్పోతుంటారు. ఇక జీవితంలో బిడ్డలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటారు. ఇక మరికొంత మంది ఐఏఎస్ కావాలనో.. లేదంటే ఐపీఎస్ కావాలనో కలలు కంటుంటారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఆదివారం దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అయితే ఒక అభ్యర్థి నిమిషం లేటుగా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకుంది. దీంతో సిబ్బంది గేట్లు మూసేశారు. ఈ పరిణామంతో అభ్యర్థితో పాటు ఆమె తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. తమ బిడ్డ ఎగ్జామ్ రాయకుండా పోతుందన్న ఆవేదనతో గేటు ముందే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఎక్కి ఎక్కి ఏడుస్తూ అక్కడినే ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడ్నే ఉన్న కొంత మంది మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం గుర్‌గ్రామ్‌‌కు చెందిన దంపతులు తమ కుమార్తెను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే నిర్దేశించిన సమయానికి నిమిషం ఆలస్యమైన కారణంగా సదరు అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనమతించలేదు. ఎగ్జామ్ సెంటర్‌లోకి ప్రవేశం కల్పించలేదు. ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో తమ కుమార్తె పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశం లేదని, మరో ఏడాది సమయం వృధా అవుతుందని యువతి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు. తల్లి అయితే ఏకంగా సొమ్మసిల్లి కిందపడిపోయింది. కళ్ల ఎదుటే తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడుతుండడాన్ని చూసిన అభ్యర్థి ధైర్య తెచ్చుకొని తల్లిదండ్రులను ఓదార్చింది.

మంచి నీళ్లు తాగు నాన్నా, వచ్చే సంవత్సరం రాయవచ్చు అమ్మా అంటూ ఆ అభ్యర్థి ఇద్దరికీ సముదాయించే ప్రయత్నం చేసింది. అయితే ఒక సంవత్సరం వృథాపోయిందంటూ తల్లిదండ్రులు ఇద్దరూ వాపోయారు. కూతురి కోసం తల్లిదండ్రులు ఆ విధంగా తల్లడిల్లిపోవడాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి ధైర్యం చెబుతున్నారు.

 

Exit mobile version