UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!

Phonepe Ceo

Phonepe Ceo

UPI పేమెంట్స్‌కు త్వరలో ఛార్జీలు విధిస్తారనే ప్రచారం నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ వినియోగదారులకు PhonePe CEO సమీర్ నిగమ్ కీలక ప్రకటన చేశారు.. భారతీయ వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు.. UPI భవిష్యత్తులో కూడా వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. PhonePe వ్యవస్థాపకుడు, CEO సమీర్ నిగమ్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ.. “UPI భారతీయ వినియోగదారులందరికీ ఉచితంగానే ఉంది.. ఇకపై కూడా ఉచితంగానే ఉంటుంది. UPI పేమెంట్స్ చేసినందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు” అని పేర్కొన్నారు.

ఇటీవల లోక్‌సభలో Payment and Settlement Systems Act, 2007కు సవరణలు చేసే బిల్లును ఆమోదించడంతో UPI ఛార్జీలపై చర్చ మొదలైంది. ఈ సవరణ ద్వారా UPI సహా ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఏర్పడుతుంది. అయితే దీనిపై Payments Council of India కీలక వివరణ ఇచ్చింది. వినియోగదారులు, చిన్న వ్యాపారులు ఉచితంగానే UPI సేవలను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 2016లో ప్రారంభమైనప్పటి నుంచి UPI వినియోగదారులకు ఉచితంగానే ఉందని, ఇకపై కూడా భారతీయులు ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. ముఖ్యంగా కిరాణా దుకాణాల వంటి చిన్న వ్యాపారులు UPI చెల్లింపులను స్వీకరించేటప్పుడు Merchant Discount Rate (MDR) చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని Payments Council of India వెల్లడించింది.

అయితే UPI వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులను దీర్ఘకాలికంగా నిర్వహించేందుకు స్థిరమైన ఆర్థిక నమూనాను రూపొందించడంపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోందని తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థగా UPI ఎదిగిన నేపథ్యంలో దాని మౌలిక వసతులకు అవసరమైన నిధులపై ఈ చర్చ జరుగుతోందని వివరించింది. అదే సమయంలో వినియోగదారులు, చిన్న వ్యాపారులపై భారం పడకుండా రక్షణ కల్పించడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం UPI చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారులకు ఛార్జీల భయం అవసరం లేదని PhonePe CEO ప్రకటన, Payments Council of India వివరణ ద్వారా స్పష్టమవుతోంది.