UP MLC Polls: ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన అబ్యర్థి ఆకాష్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, తన కుటుంబం, మద్దతుదారుల్ని వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు వ్యవస్థపై నమ్మకంపోయిందని, వచ్చే నెల లక్నోలోని షాహీ ఈద్గాలో ఇస్లాం మతంలోకి మారుతానని ప్రకటించారు. ఆగ్రా బ్లాక్ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆకాష్ అగర్వాల్.. ఎన్నికల్లో గెలుపోటము కన్నా తన కుటుంబం, మద్దతుదారుల భద్రతే ముఖ్యమని అన్నారు. అధికారులు, అధికార పార్టీ బీజేపీ ఒత్తిడితో బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తనపై, తన మద్దతుదారులపై జరుగుతున్న పరిణామాలతో వ్యవస్థపై నమ్మకంపోయిందని అన్నారు. ఒక అధికారి తనను ‘‘నువ్వు కేవలం ఎమ్మెల్సీ అభ్యర్థివి, దేవుడివి కాదు’’ అని అన్నారని, దీంతో నేను నా దేవుడినే మార్చుకున్నాను అని వ్యాఖ్యానించారు. తమ మేనేజర్లు, మద్దతుదారుల్ని ఇష్టానుసారం అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తమను పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులుగా చూస్తున్నారని మీడియా ముందు కన్నీరుపెట్టుకున్నారు. తనపై డ్రగ్స్, ఆయుధాల తప్పుడు కేసులు పెట్టే అవకాశం ఉందని అన్నారు.
ఉత్తరప్రదేశ్ శాసన మండలిలోని 11 స్థానాలకు అక్టోబర్ 23న పోలింగ్ జరుగుతోంది. వీటిలో ఐదు పట్టభద్రుల నియోజకవర్గాలు, ఆరు ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి. లక్నో, వారణాసి, ఆగ్రా, మీరట్, అలహాబాద్–ఝాన్సీ పట్టభద్రుల నియోజకవర్గాలతో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాలు కూడా ఈ ఎన్నికల్లో ఉన్నాయి.

