Toll Fee: జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులపై కేంద్రం సీరియస్‌గా వ్యవహరించనుంది. టోల్ బకాయిలు ఉన్న వాహనాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. టోల్ బకాయిలు ఉంటే వాహనాలకు కీలక సేవలను నిలిపివేయనుంది. బకాయిలు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రిన్యువల్, నేషనల్ పర్మిట్ వంటి సేవల్ని అడ్డుకోనుంది. నిబంధనల ప్రకారం, పెండింగ్‌లో ఉన్న అన్ని టోల్ రుసుముల్ని క్లియర్ చేయకుంటే వాహనాన్ని ట్రాన్ష్పర్ చేయడం, వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మార్చడానికి ఎన్‌ఓసీని ఇవ్వడం వంటివి నిలిపేయనున్నారు. సెంట్రల్ మోటర్ వెహికిల్(రెండో సవరణ) రూల్స్-2026 ద్వారా ఈ మార్పులు అమలులోకి వచ్చాయి. 1989 నాటి సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్‌లో కేంద్రం సవరణలు తీసుకువచ్చి, కొత్తగా ఈ మార్పులను తెచ్చింది.
టోల్ ఎగవేతను అరికట్టడంతో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ETC) వ్యవస్థను బలోపేతం చేయడం, భవిష్యత్తులో బారియల్ టెస్ టోలింగ్ వ్యవస్థను తీసుకురావడానికి ఈ చర్య తీసుకున్నారు. సవరించిన నిబంధనల ప్రకారం ప్రభుత్వం ‘‘చెల్లించని వినియోగదారు రుసుము’’ అధికారిక నిర్వచనాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, ఒక వాహనం జాతీయరహదారిపై ప్రయాణించి, ఈటీసీ/ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థలో నమోదు అయి, వర్తించే టోల్ ఫీజు చెల్లించకపోతే దానిని అన్ పెయిడ్ టోల్/ అన్ పెయిడ్ యూజర్ ఫీజుగా పరిగణిస్తారు.
టోల్ బకాయిలను చెల్లించని వాహనాల రెన్యూవల్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ల జారీని నిలిపేయనున్నారు. కమర్షియల్ వాహనాలకు నేషనల్ పర్మిట్ ఇవ్వరు. Form 28లో కూడా మార్పు చేసింది. ఇకపై వాహన యజమానులు తమ వాహనంపై టోల్ బాకాయిలు ఉన్నాయా లేవా అని ప్రకటించాలి. సంబంధిత వివరాలను ఫామ్‌లో నమోదు చేయాలి. ఈ నిబంధనలు భవిష్యత్తులో అమలులోకి రానున్న మల్టీ లేన్ టోల్ ఫ్లో(MLFF) టోల్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తుందని కేంద్రం చెప్పింది. MLFF వ్యవస్థ టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గిస్తుందని, ప్రయాణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, సాంకేతికత ఆధారిత అమలు ద్వారా సమ్మతిని పెంచుతుందని భావిస్తున్నారు.
