NTV Telugu Site icon

Union Budget 2025: వాతలు పెడతారా..? వరాలిస్తారా..?

Union Budget 2025

Union Budget 2025

Union Budget 2025: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే 2025-26 వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు అంచనాలు పెట్టుకున్నాయి. ఎవరికి వారు బడ్జెట్ తమ ఆశలకు అనుగుణంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ముఖ్యంగా భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న సామాన్యులు కీలక మార్పులు ఉండొచ్చని ఆశిస్తున్నారు. ధరలకు కళ్లెం పడాలని.. ఆర్ధిక భారం తగ్గాలని కోరుకుంటున్నారు. అటు వేతన జీవులు ట్యాక్ భారం తగ్గాలని ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి మధ్యతరగతి ప్రజలకు నిరుద్యోగం ప్రధాన ఆందోళనగా మిగిలిపోయింది. మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లతో పాటు స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. మారుతున్న జాబ్ మార్కెట్‌కి తగిన విధంగా స్కిల్స్‌ అందించాలని, వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: Jet Fuel Hike : బడ్జెట్ కు ముందు విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 5శాతం పెరిగిన జెట్ ఫ్యూయెల్ ధర

బడ్జెట్‌లో అందరూ కోరుకుంటున్న మార్పు ఆదాయ పన్ను మినహాయింపు. మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి చాలా కాలంగా ట్యాక్స్ రిలాక్సేషన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షలుగా ఉన్న ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ లిమిట్‌ని రూ.5 లక్షలు పెంచాలని కోరుతున్నారు. ఈ నిర్ణయంతో పన్ను చెల్లింపుదారులకు మరింత డబ్బు ఆదా అవుతుందని, వ్యయం, ఆర్థిక వృద్ధిని పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పొదుపును ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80C, 80D, 10(13A) వంటి డిడక్షన్‌లు చేర్చాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ … ఆర్ధిక సర్వేను ప్రవేశ పెట్టారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌ అంచనాలను ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. 2026 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.3 నుంచి 6.8 శాతం వరకూ ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

Read Also: Bandi Sanjay Kumar: చిల్లర ఆటలు ఆపి హామీలు, వాగ్దానాలను అమలు చేయడంపై దృష్టి పెట్టండి

జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రియల్ టర్మ్స్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.4గా నమోదైందని, ఇది ఆర్బీఐ అంచనా వేసిన 7 శాతం కంటే తక్కువని తెలిపింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా జీడీపీ వృద్ధి రేటు ఆర్బీఐ అంచనాలకు అందుకోలేదని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చని తెలిపింది. సీజనల్ వెజిటబుల్ ధరలు తగ్గడం, ఖరీఫ్ పంట రావడం కారణమని తెలిపింది. ఈ ప్రభావంతో 2026 తొలి ప్రథమార్థంలో కూడా ఆహార ధరలు అదుపులో ఉంటాయని అంచనా వేసింది. అయితే వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ అగ్రికల్చరల్ ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావానికి అవకాశాలుంటాయని తెలిపింది. 2024-25 జాతీయ ఆదాయం డాటా దేశంలోని అన్ని రంగాలు పటిష్టంగానే ఉన్నాయని తెలిపింది. వ్యవసాయరంగం యథాప్రకారం పటిష్టంగా ఉందని, అన్ని ట్రెండ్ లెవెల్స్‌ను అధిగమించిందని తెలిపింది. పారిశ్రామిక రంగం సైతం కరోనా మహమ్మారికి ముందున్న పరిస్థితిని అధిగమించి పురోగమిస్తోందని తెలిపింది.