UAE Captain Basil Hameed: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన బ్యాటింగ్ విధ్వంసం ప్రత్యర్థి జట్టును తీవ్రంగా కలవరపరిచింది. అతడి ధాటికి తమ బౌలర్లు నిస్సహాయంగా మారారని యూఏఈ కెప్టెన్ బాసిల్ హమీద్ అంగీకరించాడు. వైభవ్ ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తే అతడిని కట్టడి చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. ఈ ఘోర పరాజయం నుంచి తేరుకోవడానికి తమకు కొంత సమయం పడుతుందని తెలిపాడు.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నీలో భాగంగా మంగళవారం భారత్-Aతో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా 144 బంతుల్లో 130 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. అతడికి కెప్టెన్ బాసిల్ హమీద్ (36 నాటౌట్) సహకరించాడు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
అయితే 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-Aకు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. కేవలం 53 బంతుల్లోనే 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 28 బంతుల్లో సెంచరీ, 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఇక 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి లిస్ట్-A క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు దాదాపు అన్ని రికార్డ్స్ ను తుడిచివేశాడు.
ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ పేరిట ఉన్న 29 బంతుల వేగవంతమైన సెంచరీ రికార్డును, చాడ్ బోవ్స్ నెలకొల్పిన 103 బంతుల వేగవంతమైన డబుల్ సెంచరీ రికార్డును వైభవ్ అధిగమించాడు. అంతేకాకుండా లిస్ట్-ఏ క్రికెట్లో ఐదు ఓవర్లలోనే 100 పరుగులు సాధించి భారత్-ఏ అత్యంత వేగంగా జట్టు సెంచరీ నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వైభవ్ ఔటయ్యే సమయానికి భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో ఉండగా, రింకూ సింగ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. భారత్-ఏ 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సెమీఫైనల్‌కు చేరుకుంది.
మ్యాచ్ తర్వాత స్పందించిన యూఏఈ కెప్టెన్ బాసిల్ హమీద్.. వైభవ్ బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘ఇది మాకు చాలా కఠినమైన మ్యాచ్. వైభవ్ ఇలాగే ఆడితే అతడిని కట్టడి చేయడం చాలా కష్టం. ఈ ఓటమి మాకు పెద్ద షాక్. దీని నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాతే మ్యాచ్‌లో మేం చేసిన తప్పిదాలను సమీక్షించుకుంటాం’ అని తెలిపాడు. తమ జట్టు తరఫున సెంచరీ చేసిన హర్‌ప్రీత్ సింగ్ భాటియాపైనా బాసిల్ ప్రశంసలు కురిపించాడు. అతడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, యూఏఈ తరఫున అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడని పేర్కొన్నాడు. అతడి సెంచరీ రాబోయే సిరీస్‌లకు ముందు మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డాడు.
తమ జట్టు యువ ఆటగాళ్లతో కూడుకున్నదని, వారిలో చాలామందికి ఇలాంటి పెద్ద టోర్నీల్లో ఆడటం ఇదే మొదటిసారని బాసిల్ వెల్లడించాడు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను యువ ఆటగాళ్లు ఎదుర్కొన్న తీరుపై గర్వంగా ఉందన్నాడు. అయితే భారత్, పాకిస్థాన్ వంటి బలమైన జట్లను ఓడించాలంటే సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో ఎదురైన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని తదుపరి సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తామని, తమ తదుపరి సిరీస్ నేపాల్‌తో ఉంటుందని బాసిల్ హమీద్ తెలిపాడు.

