NTV Telugu Site icon

Mother Dead Body: ఏడాది కాలంగా.. తల్లి శవంతోనే జీవిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు!

Body

Body

Two UP Sisters Found Living With Their Mother’s Dead Body: ఓ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఏడాది క్రితం మరణించిన తల్లి శవంను ఇంట్లోనే పెట్టుకొని నివసిస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు వారికి అక్కాచెల్లెళ్లు కొన్ని రోజులుగా కనిపించకపోవడం, తలుపులు మూసి ఉండడం కారణంగా అనుమానం రావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. అక్కాచెల్లెళ్ల మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది.

వివరాల ప్రకారం… మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా దేవి త్రిపాఠి (52) తన ఇద్దరు కూతుళ్లు పల్లవి (27), వైశ్విక్‌ (17)లతో కలిసి ఓ ఇంట్లో ఉండేది. పల్లవి పీజీ పూర్తిచేయగా.. వైశ్విక్‌ పదో తరగతి చదువుతోంది. ఉషా భర్త రెండేళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఉషా ఓ దుకాణం నడుపుతూ జీవనం సాగించేది. అనారోగ్యంతో 2022 డిసెంబరు 8న ఉషా మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెకు అక్కాచెళ్లెలిద్దరూ అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. మృతదేహం వాసన బయటకు రాకుండా.. అగర్బత్తీలు కాల్చేవారు.

Also Read: Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

కావలసిన వస్తువుల కోసం పల్లవి, వైశ్విక్‌ అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. అక్కాచెల్లెళ్లు కొన్ని రోజులుగా కనిపించకపోవడం, తలుపులు మూసి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి.. బందువులకు సమాచారం ఇచ్చారు. మీర్జాపుర్‌లో ఉంటున్న ధర్మేంద్రకుమార్‌ బుధవారం తన చెల్లి ఉషాను చూసేందుకు వచ్చాడు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన ధర్మేంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. ఓ గదిలో అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అక్కాచెల్లెళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారి మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. పల్లవి, వైశ్విక్‌లను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Show comments