Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు

  • దేహమంతా గాయాలే
  • తెలుగు నటి పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు
  • ఇంకా పరారీలోనే భర్త సమర్థ్ సింగ్‌
Twishasharmadeath

Twishasharmadeath

తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోపాల్ ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం నిర్వహించిన పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. ట్విషా శర్మ ఉరివేసుకోవడం వల్లే మరణించిందని తేల్చినప్పటికీ.. ఆమె శరీరంపై పలు బలమైన దెబ్బల గాయాలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ట్విషా శర్మ మే 12 రాత్రి సుమారు 10:26 గంటలకు ఇంటి టెర్రస్‌పై జిమ్నాస్టిక్ రింగ్ తాడుతో ట్విషా ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా మే 13 అర్ధరాత్రి తర్వాత మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ట్విషా శర్మకు 2025 డిసెంబర్‌లో భోపాల్‌కు చెందిన సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరకట్న వేధింపులు, మానసిక హింస ఎదుర్కొంటోందని ట్విషా కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు.

అయితే తాజాగా పోస్టుమార్టం నివేదికలో మెడపై రెండు ఎర్రటి లిగేచర్ గుర్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మెడ వెనుక భాగంలో గుర్తు పూర్తిగా లేకపోవడం.. చర్మం పొడిగా, గట్టిగా మారిపోవడం గమనించినట్లు వైద్యులు తెలిపారు. అలాగే శ్వాస ఆడక మరణించిన కేసుల్లో కనిపించే లక్షణాలు కూడా గుర్తించారు. ముఖం ఉబ్బడం, చెవులు, గోళ్ల వద్ద నీలిరంగు మార్పులు, కంటిలో రక్తస్రావ చిహ్నాలు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. మెడపై ఉన్న గుర్తుల కింద అంతర్గతంగా చిన్న గాయాలు కూడా గుర్తించారు. ఊపిరితిత్తుల్లో టార్డ్యూ స్పాట్స్ కనిపించాయని.. ఇవి సాధారణంగా ఊపిరాడక చనిపోయిన సందర్భాల్లో కనిపించే లక్షణాలని వైద్యులు తెలిపారు. మెదడు, ఊపిరితిత్తులు, కడుపు భాగాల్లో కూడా రక్తం గడ్డకట్టిన లక్షణాలు కనిపించాయని రిపోర్టులో పేర్కొన్నారు.

ఇక ఉరి కారణంగా వచ్చిన గాయాలతో పాటు.. శరీరంపై పలు బలమైన దెబ్బల గాయాలు కూడా ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. మెడ ఎడమ వైపు గీతలు, ఎడమ చేయి, మోచేతి, కుడి మణికట్టు, కుడి ఉంగర వేళ్లపై గాయాలు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తల ఎడమ భాగంలో 2 సెం.మీ x 2 సెం.మీ పరిమాణంలో గాయం గుర్తించారు. ఈ గాయాలు మరణానికి ముందు జరిగినవేనని వైద్యులు పేర్కొన్నారు.

పోస్టుమార్టం నివేదికలో మరో కీలక విషయం కూడా బయటపడింది. ట్విషా గర్భసంచి విస్తరించి ఉండటం, లోపల కణజాలం కనిపించడం ద్వారా వారం రోజుల ముందు గర్భస్రావం జరిగినట్లు రికార్డు చేశారు. విషప్రయోగం జరిగిందా? అనే కోణంలో రక్తం, జుట్టు, గోర్లు తదితర నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

ఇదిలా ఉంటే కేసులో ప్రధాన నిందితుడిగా భర్త సమర్థ్ సింగ్ పేరును పోలీసులు పేర్కొన్నారు. అతడిని పట్టుకునేందుకు సమాచారం అందించిన వారికి రూ.10 వేల బహుమతి ప్రకటించారు. అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేసేందుకు భోపాల్ కమిషనరేట్, పాస్‌పోర్ట్ కార్యాలయంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. ట్విషా అత్తగారు, రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 17న గర్భం నిర్ధారణ అయిన తర్వాత ట్విషా ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని.. తాను బిడ్డను వద్దనుకుందని.. తర్వాత గర్భస్రావం చేయించుకుందని ఆరోపించారు. ఈ ఘటన తర్వాత తన కుమారుడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ట్విషా తండ్రి నవనిధి శర్మ తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె ప్రతిష్టను చెడగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ముందస్తు బెయిల్‌పై బయట ఉన్న గిరిబాలా సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని.. సుప్రీంకోర్టు లేదా భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

నోయిడాలో నివాసం ఉండే ట్విషా శర్మకు… 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్‌‌లోని భోపాల్‌కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్‌సింగ్‌తో ఢిల్లీలో గ్రాండ్‌గా వివాహం జరిగింది. పెళ్లైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్‌లోని అత్తగారింట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది.

సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితో వాట్సాప్‌లో చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమర్థ్‌సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ వాట్సాప్ చాట్ వెలుగులోకి రావడంతో.. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుట నిరసనకు దిగింది. తమ కుమార్తెను చంపేసి.. ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.