Site icon NTV Telugu

Tuni Municipal Vice Chairman: తుని మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా!

Tuni Municipal Office

Tuni Municipal Office

తుని మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటించారు. మంగళవారం ఉదయం ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే ఎన్నికకు హాజరయ్యారు. తమకు రక్షణ కల్పిస్తేనే ఎన్నికకు వస్తామని వైసీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. 28 మంది కౌన్సిలర్లలో 15 మంది హాజరైతేనే ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. తుని మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడడం ఇది మూడోసారి.

తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో 30 స్థానాలలో వైసీపీ గెలిచింది. ఒక కౌన్సిలర్ మృతి చెందగా, మరొక కౌన్సిలర్‌కి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. 28 మంది కౌన్సిలర్లు వైసీపీకి చెందిన వారే. నాలుగు రోజుల కింద పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. తన వర్గం 18 మంది కౌన్సిలర్లతో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే ఉన్నారు. 18 మందిలో నలుగురు తమకు సపోర్ట్ చేస్తారని టీడీపీ ప్రకటించడంతో దాడిశెట్టి రాజా అలర్ట్ అయ్యారు.

మున్సిపల్ సమావేశానికి రావాలని కౌన్సిలర్లును అధికారులు కోరారు. ఇంటి చుట్టూ టీడీపీ కార్యకర్తలు దాడి చేయడానికి సిద్ధంగా ఉంటే.. ఎలా వస్తామంటూ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఇప్పటికే పది మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీ వెళ్లి సమావేశానికి హాజరయ్యారు. 15 మంది ఉంటేనే కోరం జరుగుతుంది. కోరం ఉంటేనే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. టీడీపీ కార్యకర్తలను దూరంగా పంపిస్తేనే సమావేశానికి వస్తామని వైసీపీ కౌన్సిలర్లు స్పష్టం చేశారు. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి. అంతకుముందు టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. గొడవను అదుపు చేస్తున్న పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదంకు దిగారు.

Exit mobile version