Site icon NTV Telugu

TTD: బీహార్‌లో శ్రీవారి ఆలయం.. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మాణం

Ttd

Ttd

TTD to Build Venkateswara Temple in Patna: బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, భూమి కేటాయింపునకు పూర్తిస్థాయి ఆమోదం తెలపడంతో ఉత్తర భారతంలో టీటీడీ కార్యకలాపాలకు కొత్త దశ ప్రారంభమైంది. పాట్నా పరిధిలోని మోకామా ఖాస్ ప్రాంతంలో స్థలాన్ని ఆలయ నిర్మాణం కోసం కేటాయించగా, దీన్ని దీర్ఘకాలిక లీజు విధానంలో కేవలం నామమాత్రపు రుసుముతో టీటీడీకి అందజేయనున్నారు. 10.11 ఎకరాల భూమిని కేవలం ఒక్క రూపాయి టోకెన్ లీజు రెంట్‌పై 99 సంవత్సరాల పాటు టీటీడీకి లీజుకు ఇవ్వనున్నారు.

READ MORE: Virat Kohli: మరో సెంచరీ వచ్చేది.. కానీ టాస్ గెలిచాం.. వీడియో వైరల్

బీహార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతయ అమృత్‌ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ ద్వారా తెలియజేశారు. ఈ నిర్ణయంపై నాయుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇది భక్తులకు ఆధ్యాత్మికంగా మరింత చేరువయ్యే గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ఉత్తర భారత్‌లో వేంకటేశ్వర స్వామి క్షేత్రానికి పునాది వేయడం ద్వారా బీహార్‌తో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సౌలభ్యం కలగనుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అక్కడ ధార్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వీలు ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్‌ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖాధికారులను ఒప్పంద ప్రక్రియ కోసం నియమించగా, త్వరలోనే టీటీడీ ప్రతినిధులు అధికారిక సంప్రదింపులు ప్రారంభించనున్నారు. నిర్మాణానికి అవసరమైన విధివిధానాలు, రూపకల్పన, పరిపాలన సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఆలయ నిర్మాణానికి సహకారం అందించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు సైతం ప్రశంసలు తెలిపినట్లు సమాచారం.

Exit mobile version