Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..

Job Fraud

Job Fraud

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల కలలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు గుంజిన ఒక భారీ మోసం తాజాగా తిరుపతిలో వెలుగుచూసింది.

రూ.3 కోట్ల భారీ స్కామ్.. అసలేం జరిగిందంటే..
తిరుపతిలో నిరుద్యోగులే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే నిందితుడు భారీ వసూళ్లకు తెరలేపాడు. తాను ఒక అడ్వకేట్‌నని పరిచయం చేసుకుని, బాధితులకు నమ్మకం కలిగించాడు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ జనరల్ మేనేజర్ (GM) సుబ్రహ్మణ్యం ద్వారా తనకు ఉన్నతస్థాయి సంబంధాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పాడు. అంతేకాకుండా, దేవస్థానంలో ఉన్న అన్యమత ఉద్యోగుల స్థానాల్లో వీరికి ఖాళీలు భర్తీ చేస్తామని నమ్మబలికాడు.

నిరుద్యోగులను పూర్తిగా నమ్మించడానికి టీటీడీ అధికారిక లోగోలతో కూడిన నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను కూడా సృష్టించి ఇచ్చాడు. దీంతో నిజంగానే ఉద్యోగాలు వస్తాయని నమ్మిన బాధితుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.15 లక్షల నుండి రూ.50 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా దాదాపు 25 మందికి పైగా నిరుద్యోగుల నుండి సుమారు 3 కోట్ల రూపాయల మేర దోచుకున్నాడు.

బాధితుల ఆవేదన..
డబ్బులు తీసుకున్న తర్వాత జాయినింగ్ ఆర్డర్స్ పేరుతో నిందితుడు నెలల తరబడి కాలయాపన చేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన బాధితులు అతడిని నిలదీయగా.. సమాధానం దాటవేయడంతో మోసపోయామని గ్రహించారు. చివరకు న్యాయం చేయాలంటూ బాధితులంతా తిరుపతి ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ ఆవేదనను బయటపెట్టారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వచ్చే ఇలాంటి దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.