Site icon NTV Telugu

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్‌షాక్.. మరోసారి పెరగనున్న బస్ ఛార్జీలు..

Tsrtc

Tsrtc

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ బిగ్‌షాక్ ఇచ్చింది. బస్ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం.. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మొయలేదు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 23న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీని సంస్థ వసూలు చేయనుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎస్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజిలకు రూ.5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీని సంస్థ విధించనుంది. అలాగే మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీని వసూలు చేయనుంది.

READ MORE: Baahubali Epic : బాహుబలి కోసం రంగంలోకి అనుష్క శెట్టి.. జక్కన్న మాస్టర్ ప్లాన్

హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఈ అదనపు ఛార్జీ అమలు ఈ నెల 6(సోమవారం) నుంచి అమల్లోకి వస్తుంది. హైదరాబాద్ భవిష్యత్ బాగు కోసం వాడకంలోకి తీసుకువస్తోన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలు ఆదరించాలని, నగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతున్న ఈ గ్రీన్ జర్నీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సంస్థ కోరుతోంది. ఈ పర్యావరణహిత కార్యక్రమానికి సహకరించి.. గతంలో మాదిరిగానే ఆర్టీసీ సేవలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తోంది. రాబోయే 2800  కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్‌టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. అలాగే, ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే, కొత్తగా 10 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.

Exit mobile version