Site icon NTV Telugu

Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనానికి తెరలేపారు. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న వేళ, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. యుద్ధ వ్యూహాల కంటే తన స్వడబ్బాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం 20 నిమిషాల ప్రసంగంలో ఏకంగా 40 సార్లు ‘నేను, నా’ అంటూ తనను తాను పొగుడుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

READ ALSO: US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన రక్షణ మంత్రి.. అమెరికా సైన్యంలో భారీ కుదుపు

యుద్ధం మధ్యలో ‘సెల్ఫ్ డబ్బా’ కార్యక్రమం..
జాతిని ఉద్దేశించి ప్రసంగించే ముందే వైట్ హౌస్ వేదికగా ట్రంప్ ఒక వింత ప్రకటన చేశారు. “నేను ఎంత గొప్పవాడినో, అమెరికా కోసం ఎంత అద్భుతమైన పనులు చేశానో ప్రపంచానికి చెప్పబోతున్నాను” అంటూ ప్రకటించారు. ప్రసంగం ప్రారంభంలో ఇరాన్ అణ్వాయుధాల గురించి భయాన్ని రేకెత్తించిన ఆయన, వెంటనే క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకున్నారు. “నేను ఇరాన్‌ను ఆపాను.. నేను దాడి చేశాను.. మేమే తోపు” అంటూ ప్రతి 30 సెకన్లకు ఒకసారి తనను తాను ఈ ప్రసంగంలో కీర్తించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌ను ‘రాతియుగానికి’ పంపిస్తానంటూ ట్రంప్ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ప్రకటించారు. ఇది మరో రెండు మూడు వారాలు కొనసాగుతుందని ఆయన చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలోనే ఇరాన్ కేవలం 40 నిమిషాల్లో 11 దాడులు చేసి తన సత్తా చాటింది. అటు ఇరాన్ లో పాలన మారిపోయిందని ట్రంప్ అంటుంటే, వాస్తవానికి అక్కడ మొజ్తబా ఖమేనీ రూపంలో మరింత కఠినమైన నాయకత్వం బలపడటం గమనార్హం.

పడిపోతున్న పాపులారిటీ.. పెరుగుతున్న వ్యతిరేకత
ఒకవైపు యుద్ధం, మరోవైపు ఆర్థిక సంక్షోభంతో అమెరికన్లు సతమతమవుతున్నారు. తాజా సర్వేల ప్రకారం.. ట్రంప్ ఆమోద రేటింగ్ (Approval Rating) 35 శాతానికి పడిపోయినట్లు సమాచారం. 75 శాతం మంది అమెరికన్లు ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్) ఓటర్లలో కూడా ఆయన గ్రాఫ్ 14 పాయింట్లు పడిపోయింది. ఇదే సమయంలో యుద్ధం విషయంలో తనకు మద్దతు ఇవ్వలేదన్న కోపంతో ట్రంప్ మర్యాద గీత దాటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై వ్యక్తిగత దాడికి దిగారు. మాక్రాన్ భార్య అతనితో దారుణంగా ప్రవర్తిస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాక్రాన్ స్పందిస్తూ.. “ఒక దేశాధినేతగా గంభీరంగా ఉండాలి కానీ, ఇలా పూటకో మాట మాట్లాడకూడదు” అని చురకలు అంటించారు.

మొత్తానికి ట్రంప్ ప్రసంగం ఒక దేశాధినేత బాధ్యతాయుతమైన మాటలా కాకుండా.. ఒక వ్యక్తి తనను తాను ఎలివేట్ చేసుకునే ‘సెల్ఫ్ డబ్బా కార్యక్రమం’లా సాగింది. యుద్ధం వల్ల అమెరికాకు ఏం ఒరుగుతుందన్న 34 కోట్ల మంది ప్రజల ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. కేవలం ‘నేనే గొప్ప’ అని చాటుకోవడానికే ట్రంప్ ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

Exit mobile version