Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇతర దేశాలపై టారిఫ్‌లు విధించే నిర్ణయం దేశ అధ్యక్షుడి పరిధిలో లేదని యూఎస్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అంశంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. గవర్నర్లతో కలిసి వైట్ హౌస్‌లో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని “అవమానం”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని CNN వెల్లడించింది. అదే సమయంలో తన వద్ద మరో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందని ఆయన చెప్పినట్లు వార్త కథనం పేర్కొంది. ఈ కేసు కేంద్రబిందువు ట్రంప్ అమలు చేసిన ఆ గ్లోబల్ టారిఫ్‌లే. అత్యవసర పరిస్థితుల కోసం ఉన్న ఒక చట్టాన్ని ఆధారంగా తీసుకుని ట్రంప్ ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంపై “రిసిప్రోకల్ టారిఫ్‌లు” విధించారు. ఈ విధానం ద్వారా అమెరికా ప్రయోజనం కాపాడాలనే ఉద్దేశమే తనదని ముందే చెప్పారు. కానీ కోర్టు మాత్రం అధ్యక్షుడికి ఆ చట్టం కింద ఇలాంటి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేసింది. ఆరు మంది న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకోగా ముగ్గురు మాత్రం విభేదించారు. దీంతో ఈ తీర్పు ట్రంప్‌కు బిగ్ షాక్‌గా మారింది.
READ MORE: Holi 2026 Dates Confusion: హోలీ ఎప్పుడు..? మార్చి 3 లేదా 4..?.. శుభ సమయం ఏంటి..?
అసలు ఏం జరిగింది?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఆ దేశ సుప్రీంకోర్టు శుక్రవారం కళ్లెం వేసింది. ఇతర దేశాలపై ఇష్టానుసారం టారిఫ్‌లు పెంచుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు భారీ దెబ్బ తగిలింది. ఇతర దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి చట్టబద్ధమైన అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ అత్యవసర పరిస్థితుల కోసం ఉన్న చట్టాన్ని ఉపయోగించి ప్రపంచ దేశాలపై సుంకాలు విధించడం అధికార దుర్వినియోగమేనని తీర్పులో పేర్కొంది. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 6–3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. అంటే తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. దిగువ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతి పన్నులు విధించడం సరైంది కాదని స్పష్టం చేసింది.
