Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ ‘రాగి గంజి’ తయారీ చేసుకోండి ఇలా.!

Ragi Ganji

Ragi Ganji

Ragi Ganji: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో ఒకటి. వీటిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాగి తింటే శరీరంలో వేడి పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, రాగిని పెరుగుతో కలిపి గంజి రూపంలో తీసుకుంటే అది శరీరానికి సహజమైన కూలెంట్‌గా పనిచేస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ సాంప్రదాయ ‘రాగి గంజి’ శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి దీనిని ఎలా తాయారు చేస్తారో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు:

* రాగి పిండి – ¼ కప్పు
* నీరు – 3 కప్పులు
* చిక్కటి పెరుగు – 1 కప్పు
* చిన్న ఉల్లిపాయలు – 5 (సన్నగా తరిగినవి)
* పచ్చిమిర్చి – 2 (సన్నగా తరిగినవి)
* కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు (తరిగినది)
* ఉప్పు – 1 టీస్పూన్
* అవసరమైతే అదనపు నీరు

×
×
Ad

తయారీ విధానం:

* ముందుగా రాగి పిండిని తగినంత నీటిలో కలిపి రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల రాగిలో సహజ ప్రోబయోటిక్స్ ఏర్పడి జీర్ణక్రియకు మేలు చేస్తాయి.

* మరుసటి రోజు పైన ఏర్పడిన నురుగును తొలగించి, మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒక పాత్రలో మూడు కప్పుల నీటిని మరిగించి, అందులో రాగి మిశ్రమాన్ని పోస్తూ కలుపుతూ ఉండాలి.

* మధ్యస్థ మంటపై సుమారు 15 నిమిషాల పాటు ఉడికించాలి. ముద్దలా చిక్కబడిన తర్వాత మంట ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.

* చల్లారిన రాగి మిశ్రమంలో చిక్కటి పెరుగు వేసి బాగా కలపాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి మళ్లీ బాగా కలపాలి.

* మిశ్రమం మరీ చిక్కగా ఉంటే అవసరమైనంత నీరు జోడించి గంజిలా చేసుకోవాలి. అంతే.. ఆరోగ్యకరమైన రాగి గంజి సిద్ధం.

ఆరోగ్య ప్రయోజనాలు:

* శరీరానికి సహజమైన చల్లదనాన్ని అందిస్తుంది.
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* కాల్షియం అధికంగా ఉండటంతో ఎముకలను బలపరుస్తుంది.
* ఐరన్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
* ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండిన భావన కలుగుతుంది.
* గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో మధుమేహ రోగులకు అనుకూలంగా ఉంటుంది.
* 30 ఏళ్లు దాటిన మహిళలు, ఎదుగుదల దశలో ఉన్న పిల్లలకు ఇది మంచి పోషకాహారం.