NTV Telugu Site icon

Top Headlinews @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చిన జైశంకర్..

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ) శిఖరాగ్ర సమావేశం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. బుధవారం ఎస్‌సీఓ మీటింగ్స్ ప్రారంభమయ్యాయి. భారతదేశం తరుపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న ఇస్లామాబాద్ వెళ్లారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ గడ్డపైనే ఆ దేశానికి జైశంకర్ చురకలంటించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు కార్యకలాపాలు ఉగ్రవాదం, వేర్పాటువాదంతో కూడి ఉంటే, అది ద్వైపాక్షిక వాణిజ్యం, సంబంధాలు సహాయపడేందుకు సహకరించవని అన్నారు.

‘‘అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరం. చార్టర్ పేర్కొన్నట్లుగా మూడు చెడులను ఎదుర్కోవడంలో దృఢంగా, రాజీపడకుండా ఉండటం దీని అర్థం. సరిహద్దు వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం ఉన్నట్లైయితే వాణిజ్యం, ఎనర్జీ ఫ్లో, ప్రజల మధ్య పరస్పర మార్పిడి, కనెక్టవిటిని ప్రోత్సహించదు’’ అని జైశంకర్ కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పారు.

విజయ పాల డైరీ చైర్మన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమా అఖిల ప్రియ

కర్నూల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరోసారి మాటల యుద్ధం స్టార్ట్ అయింది. భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అయితే, ఎమ్మెల్యే అఖిలప్రియ నంద్యాలలో ఉన్న విజయ పాల డైరీ పరిశ్రమను నిన్న (మంగళవారం) ఆకస్మికంగా తనిఖీలు చేసింది. డైరీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే జగన్ ఫొటోలను తొలగించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను పెట్టాలని ఆదేశించింది. ఇక, మాజీ సీఎం ఫొటోలు పెట్టిన సిబ్బందిపై మండిపడింది. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శిలాఫలకాన్ని తొలగించి మురికి కాలువలో పడేసిన వారిని వదిలేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చారు.

ఏపీ జలవనరుల శాఖ మంత్రికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వినతి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వినతి చేశారు. ఇక, తుంగభద్ర హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేయాలని కోరారు. హంద్రీ-నీవా కెనాల్ రెండింతలు చేసి పూర్తిస్థాయిలో నీరు అందించేందుకు తాగిన చర్యలు చేపట్టాలన్నారు. తుంగభద్ర డ్యాం ద్వారా అనంతపురం, కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 32 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా.. కేవలం 13 టీఎంసీలు మాత్రమే విడుదలయ్యాయి.. అనంతపురం జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు ఖాళీగా ఉన్నాయని రామకృష్ణ చెప్పారు.

మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ నిలిచిందని ఆయన అన్నారు. మెడికల్ సీట్ల సంఖ్యలో దేశంలో అగ్రస్థానలలోకి తెలంగాణ చేరుకుందని ఆయన అన్నారు. నాడు అందని ద్రాక్షగా వైద్య విద్య, నేడు సాధారణ ప్రజలకు చేరువైన వైద్య విద్య అని అన్నారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో 5 మెడికల్ కాలేజీలు, 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ఆ మెడికల్ కాలేజీల సంఖ్య 34కు చేరిందని అన్నారు. 2014 వరకు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని.. అవి నేడు 8490 సీట్లు తియ్యని తెలిపారు. ఇది కేసీఆర్ మార్క్ పాలనని, మార్పు పేరు చెప్పి ఎవరూ చెరిపేయలేని ఆల్ టైం రికార్డు అని ట్వీట్ చేశారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. నూతన పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. అయితే, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట, అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టడం, రీహాబిలిటేషన్ పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇక, రాష్ట్రంలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వనరుల వినియోగం పెంచేలా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించిన మంత్రివర్గం ఆమోదించింది. దీంతో పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ, పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసే విధంగా పారిశ్రామిక పాలసీ ఉండాలని కాబినెట్ నిర్ణయించింది. ఇక, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పైనా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ జరిగింది.. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే అంశంతో నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి చంద్రబాబు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

సీఎం సిద్ధరామయ్యకి షాక్.. ముడా చైర్మన్ రాజీనామా..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య పార్వతి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌లో చిక్కుకున్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉంటే, తాజాగా సిద్ధరామయ్యకి మరో షాక్ తగిలింది. ముడా చీఫ్ మరిగౌడ ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ బుధవారం రాజీనామా చేయడం సంచలనంగా మారింది. మరిగౌడ, సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. దీర్ఘకాలిక మిత్రడు. 1983 నుంచి సిద్ధరామయ్యతో కలిసి పనిచేస్తున్నాడు. 1995లో మైసూర్ తాలూకు పంచాయతీ అధ్యక్షుడిగా, 2000లో జిల్లా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. మరిగౌడ రాజీనామాపై సిద్ధరామయ్య ఇంకా స్పందించలేదు.

జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

జార్ఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత చంపై సోరెన్ ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్ ఎన్నికలపై చర్చించేందుకు బీజేపీ నాయకత్వంతో చంపై సోరెన్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అభ్యర్థుల జాబితా త్వరలోనే విడుదల అవుతుందని చెప్పారు. ఇక తాను కోరిన స్థానం నుంచే పోటీ చేస్తానని వెల్లడించారు. బీజేపీ అధిష్టానం.. జార్ఖండ్‌పై దృష్టి పెట్టిందన్నారు. కచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చంపై సోరెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐఏఎస్‌లకు దక్కని ఊరట.. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్‌ చేయాలన్న హైకోర్టు

క్యాట్ తీర్పుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. సివిల్ సర్వెంట్ల నియామకాలను నిర్ధారించలేమని స్పష్టం చేస్తూ, ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనర్థకమని హైకోర్టు పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీపై స్టే ఇవ్వడం జరగదని, సంబంధిత వ్యక్తులు ముందుగా అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్‌ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్‌ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. రిపోర్ట్‌ చేయకుండా ఏమీ చేయలేమని, ప్రజాసేవ కోసమే ఐఏఎస్‌లు అని, ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు తెలిపింది. ట్రిబ్యునల్‌ కొట్టేస్తే కోర్టులకు రావడం కరెక్ట్‌ కాదని, మీ వాదనలు వింటాం.. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

రైతుకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త..

బుధవారం జరిగిన మోడీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రకటనలు చేశారు. ఒకవైపు కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు కానుకగా ఇస్తూనే మరోవైపు రైతులకు కూడా ప్రభుత్వం భారీ దీపావళి కానుకగా ఇచ్చింది. వాస్తవానికి రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని కేంద్రం పెంచింది. ఇందులో గోధుమ పంటకు క్వింటాల్‌కు రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచారు.

జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో ప్రసవాలు..

క్షేత్ర స్థాయిలో కీలక సేవలందిస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీహెచ్‌సీల వైద్యులు, ఆశాలు, ఏఎన్‌ఎంలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వ్యాధిని గుర్తించి, చికిత్స అందించడం ద్వారా ప్రజలు దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా కాపాడుతున్నారు. గత సంవత్సరం రికార్డు ప్రకారం.. మొత్తం ప్రసవాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 76.3% డెలివరీలు జరగడం సరికొత్త రికార్డు. అయితే.. గర్భిణులను కంటికి రెప్పలా కాపాడుతూ, వారిపై రూపాయి భారం పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేందుకు ఆశాలు, ఏఎన్‌ఎంలు చేస్తున్న కృషి గొప్పది. అయితే తాజాగా జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ప్రసవాలు చేశారు వైద్యులు. జగిత్యాల జిల్లా ప్రభుత్వ మాత శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో 24 గంటల్లో 25 ప్రసవాలు చేశారు. ఈ నెల 15న జగిత్యాల మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 25 ప్రసవాలు చేశారు డాక్టర్లు. వీటిలో.. 13 సాధారణ ప్రసవాలు, 12 సిజేరియన్ ప్రసవాలు చేశారు. అయితే.. దీనిపై వైద్యులకు ప్రశంసల వెల్లువెత్తాయి.