Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పసిడి ప్రియులకు షాక్.. వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు! రూ. 1500 పెరిగిన వెండి

ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. కొన్ని రోజలుగా తగ్గుతూ లేదా స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఆగష్టు 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,130గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 60 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,220గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,600లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,560 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 59,130గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,200 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,130 వద్ద కొనసాగుతోంది.

నేడు ఐర్లాండ్‌తో చివరి టీ20.. క్లీన్‌స్వీప్‌పై భారత్‌ కన్ను! ప్రయోగాలకు వేళాయే

ఐర్లాండ్‌, భారత్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 బుధవారం జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాదించి ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కలిపి భారత్‌తో ఆడిన 10 మ్యాచ్‌లు ఓడిన ఐర్లాండ్‌.. సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌ అయినా గెలవాలని చూస్తోంది. డబ్లిన్‌లో రాత్రి 7:30కు మ్యాచ్ ఆరంభం కానుంది. రిజర్వ్‌ ఆటగాళ్లను పరీక్షించేందుకు ఈ నామమాత్రమైన మ్యాచ్‌ టీమిండియాకు చక్కని అవకాశం.

ఆసియా కప్‌ 2023 ముందు గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేసిన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ట ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడం జట్టుకు కలిసొచ్చే విషయం. అయితే మరింత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం వీరిద్దరు మూడో టీ20 మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నారు. నిలకడగా రాణించలేకపోతున్న పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ స్థానంలో అవేష్‌ ఖాన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. సంజు శాంసన్‌కు విశ్రాంతిని ఇచ్చి వికెట్‌ కీపర్‌ జితేశ్‌ శర్మకు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వొచ్చు. అయితే ఆసియా కప్‌ 2023కి బ్యాకప్ కీపర్‌గా శాంసన్‌ ఎంపిక కావడంతో కొనసాగించే అవకాశం లేకపోలేదు.

వాషింగ్టన్‌ సుందర్‌కు విశ్రాంతి కల్పించి షాబాజ్‌ అహ్మద్‌ను ఆడించే అవకాశాలు ఉన్నాయి. రెండో టీ20తో అరంగేట్రం చేసి అదరగొట్టిన రింకూ సింగ్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్‌లు తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. ఇక రెండు టీ20ల్లో విఫలమయిన తిలక్ వర్మ ఈసారి సత్తాచాలని చూస్తున్నాడు. యువ భారత్ మరోసారి ఐర్లాండ్‌ను చిత్తుచేయాలని చూస్తోంది.

చంద్రయాన్‌-3పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ.. తొలి దేశంగా నిలవనున్న భారత్‌

చంద్రయాన్‌-3పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు చంద్రుడిపై చంద్రయాన్‌ ల్యాండర్‌ విక్రమ్‌ దిగనునుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై ల్యాండింగ్‌ కానుంది. జాబిల్లి దక్షిణధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 5.45 గంటల తర్వాత ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నిమిషాల పాటు ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. చంద్రయాన్‌-3 విజయవంతంమైతే భారత్‌ కొత్త రికార్డు సృష్టించనుంది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ నిలవనుంది. అయితే.. చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. చారిత్రక క్షణాల కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. జులై 14న చంద్రయాన్‌-3ని ప్రయోగించింది ఇస్రో. ఎల్‌ఎంవీ 3-ఎం 4రాకెట్‌ ద్వారా చంద్రాయన్‌-3 ప్రయోగించింది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను చంద్రుడిపైకి రాకెట్‌ మోసుకెళ్లింది.

నేడు కేసీఆర్‌ మెదక్‌ పర్యటన.. సాయంత్రం నాలుగింటికి బహిరంగ సభ..!

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్‌లో పర్యటించనున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయం, పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు సాయంత్రం భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గంలో మెదక్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం, జిల్లా ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వికలాంగులకు పెంచిన రూ.4016 పింఛన్‌ పంపిణీని బుధవారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు ఒక్కొక్కరికి రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు.

ఈ రెండింటి ప్రారంభంతో మెదక్ పట్టణం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయం, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి గుమ్మడిల, నర్సాపూర్, కౌడిపల్లి మీదుగా మధ్యాహ్నం ఒంటిగంటకు మెదక్ చేరుకుంటారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. జిల్లా పోలీసు కార్యాలయాన్ని మధ్యాహ్నం 1.20 గంటలకు, సమీకృత కలెక్టరేట్‌ను 1.40 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ సీఎస్‌ఐ చర్చి మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు.

అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులే: సుప్రీంకోర్టు

అర్చకులు కావడానికి అన్ని కులాల వారూ అర్హులేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే వారు ఆగమశాస్త్ర నియమాల ప్రకారం అర్హత పొందిన వారై ఉండాల్సి ఉంటుంది. కోయిల్ ఆగమ నిబంధనలకు అర్హులైన ఎవరైనా పూజారి కావచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. సేలం సుఖవనేశ్వర్ ఆలయంలో పూజారి నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2018లో ఆలయ పాలకమండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ అదే ఆలయంలో పనిచేస్తున్న సుబ్రమణ్య గురువు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. అందులో సుగణేశ్వరాలయం ఆగమానికి ఆధారమని, ఈ నోటీసులో పేర్కొన్న విశేషాలు ఆగమానికి ఆధారం కాదని పిటిషన్‌ లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ ఆలయ ఆగమ నియమాలు, పూజా విధానాల్లో ఉత్తీర్ణత పొందిన వారెవరైనా అర్చకులు కావచ్చని తీర్పునిచ్చారు. ఈ తీర్పునే మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది.

తెలంగాణకు వర్ష సూచన.. వచ్చే ఐదు రోజులు వర్షాలే..

రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, జనగాం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షం కురుస్తుంది. ఈ మేరకు అధికారులు ఎల్లో, గ్రీన్ అలర్ట్ ప్రకటించారు. మంగళవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. జనగాం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం కురిసింది.

వరంగల్‌లో 49.3, మహబూబాబాద్‌లో 32.3, నల్గొండలో 30.8, హైదరాబాద్‌లో కూడా పలుచోట్ల వర్షం కురిసింది. నానక్రం గూడ, హైటెక్ సిటీ, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మణికొండ, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు, ట్యాంక్ బండ్, సెరిలింగంపల్లి, షేక్‌పేట్, అంబర్‌పేట్, నాంపల్లి, ఉప్పల్, ఆసిఫ్‌నాగ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. వాతావరణ శాఖ కూడా ఏపీకి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

సాయుధ బలగాల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. 13 ఏళ్లలో 1,532 మంది ఆత్మహత్య

చేతుల్లో ఆయుధం కలిగి ఉంటున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో కొంత పెరుగుతున్నాయి. అయితే వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉద్యోగ ఒత్తిడి ఒక కారణమవుతుంటే.. ఇతర కారణాలు కూడా ఉంటున్నాయి. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు కేంద్రం జారీ చేసిన లెక్కలు చెబుతున్నాయి. గడచిన 13 ఏళ్లలో 1,532 మంది సాయుధులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రకటించింది. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు… లేదంటే తమను తాము కాల్చుకుని జీవితాన్ని ముగించేస్తున్నారు.

సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్‌ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. వాటిని నివారించడానికి తగిన మార్గాలను వెతుకుతున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల జైపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి తన పైఅధికారితోపాటు మరో ముగ్గురిని చంపేశాడు. గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీస్, సీఐఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

రేపు కేబినెట్ విస్తరణ.. పట్నం మహేందర్‌రెడ్డికి చోటు..!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా, 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే.. అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరారు గులాబీ బాస్. మరోవైపు.. దాదాపు సిట్టింగ్ లకు మరో అవకాశం.. ఇన్ని రోజులుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఆశావహులను బుజ్జగించేందుకు గాని.. సంతృప్తి చెందని వారు వేరే వారి వద్దకు వెళితే జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి. పార్టీలు.. కావాల్సినంత సమయం దొరికే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. అదే సమయంలో నేడు మంత్రివర్గంలో మార్పులు చేయనున్నట్టు సమాచారం. పోటీ చేసేందుకు టిక్కెట్టు ఆశించి తనకు వెన్నుపోటు పొడిచిన కీలక వ్యక్తులకు అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నారు.

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనున్న భారత్‌: ప్రధాని మోడీ

భారత్‌ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని.. త్వరలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఇండియా ఎదుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇండియాలో మిషన్‌ మోడ్‌ సంస్కరనలు భారత్‌లో సులభతర వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ లీడర్స్‌ డైలాగ్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. 2019 తర్వాత బ్రిక్స్ దేశాల తొలి వ్యక్తిగత సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఉన్నప్పటికీ, భారత్ నేడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. త్వరలోనే భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ వృద్ధి చోదక శక్తిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు.

 

Exit mobile version