NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన పాల ట్యాంకర్.. 18 మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై ట్యాంకర్, డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు చాలాసార్లు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు మరణించగా, 19 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం, డబుల్ డెక్కర్ బస్సు (UP95 T 4720) బీహార్‌ లోని మోతిహారి నుండి ఢిల్లీకి వస్తోంది. ఉన్నావ్‌ లోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గధా గ్రామానికి ఉదయం 5.15 గంటలకు బస్సు చేరుకోగా, వేగంగా వచ్చిన పాలతో నిండిన ట్యాంకర్ దానిని వెనుక నుండి ఓవర్‌టేక్ చేసే సమయంలో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డబుల్ డెక్కర్ బస్సు ఒక్కసారిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలు కుప్పలుగా పడ్డాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష..

వివిధ శాఖలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సమీక్షించనున్నారు. అలాగే, ఆర్థిక శాఖపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదన చేసింది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టే అంశంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేత పత్రంపై సీఎం కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు మధ్యాహ్నం 3. 30 గంటలకు ఎక్సైజ్ శాఖ మీద కీలక సమీక్ష చేయనున్నారు. కొత్త ఎక్సైజ్ పాలసీ, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత బీపీసీఎల్ ఛైర్మన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు.

శాస్త్రీయమైన పద్ధతుల్లో కృష్ణా నది జలాల పంపిణీ జరగాలి..

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం స్వాగతిస్తున్నానని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లాలో మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఆయన కోరారు. శాస్త్రీయమైన పద్ధతుల్లో కృష్ణా నది జలాల పంపిణీ జరగాలని, కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. 7 మండలాలు తిరిగి తెలంగాణకు రాకపోవచ్చని, 5 గ్రామాలు తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు సుఖేందర్‌ రెడ్డి. అంతేకాకుండా.. ఇన్కమ్ టాక్స్ కట్టేవాళ్లను, పెద్ద ఎత్తున జీతాలు తీసుకునే వాళ్లకు రుణమాఫీ, రైతు భరోసా వద్దన్నారు. సేద్యం కానీ భూమికి రైతు భరోసా వద్దని, మండలి రద్దు అవుతుంది అనేది ఉహజనీతమేనన్నారు. అనర్హత వేటు పిటిషన్ లపై గత చైర్మన్ లు, కోర్ట్ తీర్పులు, నిబంధనలను బట్టి నా నిర్ణయం ఉంటుందని, 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉండొచ్చు.. అదే జరిగేతే తెలంగాణ, ఏపీ లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయన్నారు గుత్తా సుఖేందర్‌ రెడ్డి. నల్లగొండ జిల్లాలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.

జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు..

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వాస్తవం కాదు..విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.. హామీల అమలుకు పోరాటం చేయాలి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సమస్యలపై చర్చించటం మంచి పరిణామమే అని ఆయన తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి.. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది.. రెండు చోట్లా వాళ్ళే ఉన్నారు కాబట్టి హోదా తేవాలి.. రెండు రాష్ట్రాల సమస్యలు ఇద్దరు సీఎంలు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.. నిన్న ఉచిత ఇసుక అని ప్రకటించి ఒక్క రోజులోనే బ్రహ్మాండంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నారు అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. 500 మందికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్

బంగ్లాదేశ్, భారతదేశంలో అక్రమ కిడ్నీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ ముఠా నాలుగేళ్లలో దాదాపు 500 మందికి అక్రమంగా కిడ్నీలు అమర్చింది. కిడ్నీ రాకెట్ బట్టబయలు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడి సమయంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ మార్పిడి ఎక్కువగా నోయిడాలోని ఉత్తర్, అపోలో హాస్పిటల్స్‌లో జరుగుతుంది. ఢిల్లీలోని ప్రముఖ ఆసుపత్రిలో పరీక్షలు, పరిశోధనలు మాత్రమే జరిగాయి. బంగ్లాదేశ్‌లో ఈ ముఠా మరింత యాక్టివ్‌గా ఉందని క్రైమ్ బ్రాంచ్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముఠా సభ్యులు భారతదేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పేదలను ఢిల్లీకి తీసుకొచ్చేవారు. భారతదేశంలో, వారు జసోలాలో ఇళ్లను అద్దెకు తీసుకుని లేదా గెస్ట్ హౌస్‌లలో ఉంచేవారు. ఆ తర్వాత ఆ వ్యక్తుల పాస్‌పోర్టులను లాక్కొనే వారు. దీని తరువాత, వారు కిడ్నీ దానం చేయాలని పేద బంగ్లాదేశీయులపై ఒత్తిడి తెచ్చేవారు. కిడ్నీ అమ్మితేనే ఉద్యోగం వస్తుందని వాపోయారు. దీనికి ప్రతిగా వారికి కూడా డబ్బు ఎర చూపారు.

రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే పంచుతాం

ఖమ్మం కలెక్టరేట్‌లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్‌నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని, ప్రజలు ఇచ్చే ప్రతి సూచన చాలా విలువైనదన్నారు భట్టి. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నిజమైన రైతుకి భరోసా ఉండాలన్నారు. రైతు కానీ వాళ్ళ వద్దని, గతంలో జరిగిన లోపాలు, జరిగిన ఆర్థిక నష్టం పై కూడా ఆలోచించాలన్నారు. రైతులకి ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. రైతు బంధు మీ ఖాతా లో వేశామని, రుణ మాఫీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. న్యాయమైన సహాయం రైతులకు అందివ్వాలి అన్న ఓపెన్ మైండ్ తో ప్రభుత్వం వుందని, బక్క , చిన్న కారు రైతులకి న్యాయం చేయాలి అన్న లక్ష్యం తో వున్నామన్నారు. పేపర్ లో మీడియా లో వచ్చేది ఏది నిజం కాదు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు ఎవ్వరూ అటువంటి వాటిని నమ్మవద్దన్నారు మంత్రి తుమ్మల.

అంబర్‌పేట్, బాగ్ అంబర్‌పేట్‌ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అంబర్‌పేట్, బాగ్ అంబర్పేట్ డివిజన్ లలో పర్యటించారు. సంభంధిత అధికారులను వెంటపెట్టుకొని పర్యటించిన కిషన్ రెడ్డి గారు మొదట అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు తర్వాత అక్కడే ఉన్న పటేల్ నగర్ గోశాల లో పశువుల సేవలో గడిపారు అనంతరం ప్రేమ్ నగర్ బస్తిలో పర్యటించారు ప్రజలతో మాట్లాడారు వారి సమస్యలు విన్న కిషన్ రెడ్డి వారితో కాసేపు మాట్లాడారు బస్తీల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనంతరం బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని పలు కాలనీల్లో ప్రజలతో కలిసి తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు పనుల పురోగతిపై అధికారులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చిన పలు సమస్యలను పూర్తి చేయాలని సంభంధిత అధికారులను కోరారు.

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు..

పులివెందులలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ మంత్రి నారా లోకేష్ ను విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. పులివెందుల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గంజాయి వినియోగిస్తున్నారన్న ఫిర్యాదుపై మంత్రి సీరియస్ అయ్యారు. సమగ్ర విచారణ జరిపి, గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయాల ప్రాంగణంలో గంజాయి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ఇప్పటికే తమ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని నారా లోకేష్ వెల్లడించారు.

ముస్లిం మహిళలు కూడా భరణం అడగొచ్చు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈరోజు కీలక తీర్పు వెలువరించింది. అలాంటి మహిళలు సిఆర్‌పిసి సెక్షన్ 125 ప్రకారం తమ భర్త నుండి భరణం డిమాండ్ చేయవచ్చని కోర్టు పేర్కొంది. దేశంలో లౌకిక చట్టం మాత్రమే అమలులో ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది. జస్టిస్ బీబీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ముస్లిం మహిళలు భరణం కోసం తమ చట్టపరమైన హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఆమె CrPC సెక్షన్ 125 కింద పిటిషన్ దాఖలు చేయవచ్చు. మతంతో సంబంధం లేకుండా వివాహిత మహిళలందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

కేటీఆర్‌పై ఏపీ మంత్రి సత్యకుమార్‌ ఫైర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఏపీ మంత్రి సత్య కుమార్‌ విమర్శలు గుప్పించారు. “ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా… కలెక్షన్… కరప్షన్… కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి గురించి ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగు సంవత్సరాల క్రితం నన్ను ఎక్స్ (ట్విట్టర్) లో బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికెట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి” అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా రాసుకొచ్చారు. అయితే.. అంతకుముందు.. ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందని, ముఖ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, కేతిరెడ్డి వంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటని కేటీఆర్ వ్యాఖ్యానించారుఉ. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలపై సత్యకుమార్ యాదవ్ పై విధంగా తీవ్రస్థాయిలో బదులిచ్చారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు.